Begin typing your search above and press return to search.

2023లో భారతీయులకు భారీగా అమెరికన్ వీసాలు.. ఎన్నంటే?

అన్ని వీసాల విభాగాల్లోనూ డిమాండ్ భారీగా ఉందని.. 2022తో పోలిస్తే 2023లోవీసా దరఖాస్తుల్లో 60 శాతం పెరుగుదల కనిపించినట్లుగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   30 Jan 2024 4:29 AM GMT
2023లో భారతీయులకు భారీగా అమెరికన్ వీసాలు.. ఎన్నంటే?
X

అగ్రరాజ్యం అమెరికా భారతీయులకు భారీగా వీసాలు ఇచ్చిన వైనం బయటకు వచ్చింది. గత ఏడాది (2023)లో రికార్డు స్థాయిలో అన్ని రకాల వీసాల్ని జారీ చేసింది. ఈ వీసాల సంఖ్య ఏకంగా 14 లక్షలు కావటం విశేషం. అన్ని వీసాల విభాగాల్లోనూ డిమాండ్ భారీగా ఉందని.. 2022తో పోలిస్తే 2023లోవీసా దరఖాస్తుల్లో 60 శాతం పెరుగుదల కనిపించినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది మంది అమెరికా వీసా దరఖాస్తుదారుల్లో ఒకరు భారతీయులుగా పేర్కొన్నారు.

2023లో స్టూడెంట్ వీసాలే 1.40 లక్షలు జారీ చేసింది. మూడో ఏడాది భారీగా వీసాలు జారీ చేసిన రికార్డును క్రియేట్ చేసింది. మరే దేశంలోనూ ఈ స్థాయిలో వీసాలు జారీ చేయలేదు. అంతేకాదు.. విజిటర్ వీసా అపాయింట్ మెంట్ కు వెయిటింగ్ పిరియడ్ సమయాన్ని 75 శాతానికి తగ్గించారు. సగటున వెయ్యి రోజులు ఉండే వెయిటింగ్ పిరియడ్ ను 250 రోజులకు తగ్గించినట్లుగా ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో ప్రకటించింది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. విద్యార్థి వీసాల ప్రాసెసింగ్ కేంద్రాల్లో మన దేశంలోని నాలుగు ముఖ్య నగరాలు ప్రపంచంలోని మొదటి నాలుగు స్థానాల్లో నిలవటం. ముంబయి.. ఢిల్లీ.. హైదరాబాద్.. చెన్నైలు ఈ రికార్డును క్రియేట్ చేశాయి. ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న 10 లక్షల మందికి పైగా విదేశీ విద్యార్థుల్లో నాలుగింట ఒక వంత మనోళ్లే.

కొవిడ్ వేళ ఆలస్యమైన 31 వేల వలస వీసా అప్లికేషన్లను ముంబయి కాన్సులేట్ జనరల్ పరిష్కరించింది. అంతేకాదు.. భారతీయులు.. వారి కుటుంబ సభ్యుల కోసం గత ఏడాది 3.80 లక్షల ఉద్యోగ వీసాల జారీ.. విజిటర్ వీసాలకు సంబంధించి మొత్తం 7 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. 2024లో హెచ్ 1బీ వీసాల రెన్యువల్ ప్రక్రియను తమ పైలెట్ కార్యక్రమం మరింత సులభతరం చేస్తోందని అగ్రరాజ్యం చెబుతోంది.

కొన్ని విభాగాలకు సంబంధించిన హెచ్ 1బీ వీసాల్ని అమెరికాలోనే ఉండి వాటిని రెన్యువల్ చేసుకునే ఒక పైలెట్ కార్యక్రమాన్ని ఇటీవల అమెరికా షురూ చేయటం తెలిసిందే. ఈ కార్యక్రమంలో మనోళ్లు ప్రయోజనం పొందే వీలుంది. గత ఏడాది హైదరాబాద్ లో కొత్తగా ఏర్పాటు చేసుకున్న కాన్సులేట్ భవనంలోకి తన కార్యకలాపాల్ని మార్చుకోవటం తెలిసిందే. రానున్న రోజుల్లో అహ్మదాబాద్.. బెంగళూరులో కొత్త కాన్సులేట్ కార్యాలయాల్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.