Begin typing your search above and press return to search.

టీడీపీలో మూకుమ్మడి రాజీనామాలు... ఇది ఆరంభం మాత్రమే?

By:  Tupaki Desk   |   24 Feb 2024 2:05 PM GMT
టీడీపీలో మూకుమ్మడి రాజీనామాలు... ఇది ఆరంభం మాత్రమే?
X

చాలా మంది ముందే ఊహించిందే తాజాగా జరగడం మొదలైంది! టీడీపీ - జనసేనలకు మధ్య సీట్ల సర్దుబాటులో భాగంగా సరికొత్త సమస్యలు తెరపైకి వస్తాయని.. టీడీపీ కీలక స్థానాల్లో జనసేన నేతలు సీట్లు ఎగరేసుకుపోతే మొదటికే మోసం వస్తుందని కథనాలొచ్చాయి. అయితే... జనసేన నుంచి వచ్చే సమస్యల సంగతి కాసేపు పక్కనపెడితే... టీడీపీలోనే అంతర్గత సమస్యలు ఒక్కసారిగా తెరపైకి వచ్చాయి.. తొలి జాబితా అనంతరం వరుస రాజీనామాలు వార్తల్లోకి వస్తున్నాయి.. ఈ సమయంలో ఇది ఆరంభం మాత్రమే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... తొలివిడత జాబితా విడుదలై 24 గంటలు గడవక ముందే టీడీపీలో అగ్గి రాజుకుంటుంది. కొన్ని కీలక నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు తగలబెట్టే పరిస్థితి నెలకొనగా.. మరికొన్ని నియోజకవర్గాల్లో కీలక నేతలు రాజీనామా లేఖలు రెడీ చేసుకుంటున్నారని తెలుస్తుంది. మరికొన్ని చోట్ల ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగడానికి ప్రిపేర్ అవుతున్నారని అంటున్నారు. దీంతో... ఈ వ్యవహారమేదో చినికి చినికి గాలివానగా మారే పరిస్థితి తలెత్తె ప్రమాదం ఉందని అంటున్నారు పరిశీలకులు.

ఈ క్రమంలో తాజాగా అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో రచ్చ మొదలైపోయింది. ఇందులో భాగంగా... రాయచోటి టికెట్‌ ను మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డికి ప్రకటించడంతో.. ఇప్పటికే నియోజకవర్గ ఇన్‌ ఛార్జిగా ఉన్న రమేష్‌ రెడ్డి.. చంద్రబాబుపై తిరుగుబాటు జెండా ఎగ‌రేశారు. ఈ సయంలో ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో నియోజకవర్గంలోని 11 మంది క్లస్టర్ ఇన్‌ ఛార్జిలు, 286 మంది బూత్‌ కమిటీ సభ్యులు రాజీనామాలు చేశారని తెలుస్తుంది.

వీరితోపాటు ఆరుగురు పీఎంపీలు, 20 మంది ఐటీడీపీ సభ్యులు, మాజీ జెడ్పీటీసీలు సైతం టీడీపీకి బై బై చెప్పారని అంటున్నారు. ఇదే సమయంలో... నియోజకవర్గంలో కష్టపడిన వారిని కాదని.. వేరేవారికి టికెట్ కేటాయించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ.. డబ్బుల కోసం టికెట్‌ ను అమ్ముకున్నారని ఆరోపిస్తూ.. ఇక్కడ టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తామంటు సవాల్ విసురుతున్నారు రమేష్ రెడ్డి వర్గీయులు!

ఇదే సమయంలో గజపతినగరం టీడీపీ టిక్కెట్ కోనపల్లి శ్రీనివాస్ కి కేటాయించడంతో నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కొండపల్లి అప్పలనాయుడు పార్టీకి రాజీనామా చేశారని సమాచారం. ఇంతకాలం పార్టీకి ఇన్ ఛార్జ్ గా ఎందుకు నియమించారు.. ఇంతకాలం సేవ చేయించుకుని ఇప్పుడు పక్కన ఎందుకు పెట్టారంటూ ఆయన వర్గీయులు ఫైరవుతున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో విశాఖ వెస్ట్, పెడనలోనూ పరిస్థితి తీవ్రంగా ఉందని అంటున్నారు.

ఇందులో భాగంగా... విశాఖ వెస్ట్ టిక్కెట్ పీజీవీఆర్ నాయుడు (గణబాబు) కు కేటాయించడంతో పాశర్ల ప్రసాద్ టీడీపీకి గుడ్ బై చెప్పారని తెలుస్తుంది. ఇదే సమయంలో... పెడన టికెట్‌ ను కాగిత కృష్ణ ప్రసాద్‌ కు కేటాయించారు చంద్రబాబు. దీంతో చంద్రబాబు మాట తప్పారంటూ మండిపడుతున్నారు మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌. ఈ సందర్భంగా ఇండిపెండెంట్ గా పోటీచేస్తారా అనే చర్చ తెరపైకి వచ్చింది.

ఈ క్రమంలో స్పందించిన వేదవ్యాస్... తన కుటుంబానికి పెడన నియోజకవర్గంతో విడదీయలేని అనుబంధం ఉందని.. తన తండ్రి కానీ, తాను కానీ ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఏనాడూ 40 వేలకు ఓట్లు తగ్గలేదని తెలిల్పారు. దీంతో పరోక్షంగా ఇండిపెండెంట్‌ గా బరిలో ఉంటానని స్పష్టం చేశారని అంటున్నారు పరిశీలకులు! మరి ఇంకా ఎంతమంది టీడీపీ అసంతృప్తులు రెబల్స్ గా మారతారో వేచి చూడాలి!