మాష్టారు కానిస్టేబుల్.. స్టూడెంట్ ఎస్ఐ.. ఒకే స్టేషన్ లో!
ఈ ఆసక్తికర సంఘటనకు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ వేదికగా మారింది.
By: Tupaki Desk | 6 Feb 2025 6:36 AM GMTసినిమా సీన్ కాదు. కానీ.. సినిమాటిక్ గా అనిపించే సీన్. తనకు పాఠాలు చెప్పి.. కెరీర్ లో ఎదిగేందుకు ఎంతో సాయం చేసిన టీచరు కానిస్టేబుల్ గా పని చేస్తున్న పోలీస్ స్టేషేన్ కు.. ఆయన దగ్గర పాఠాలు నేర్చుకున్న శిష్యురాలు ఎస్ఐగా ఛార్జ్ తీసుకోవటం.. తనకంటే ఎదిగిన శిష్యురాలికి సంతోషంగా సెల్యూట్ చేసిన వైనం గురించి తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు. ఈ ఆసక్తికర సంఘటనకు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ వేదికగా మారింది. అసలేం జరిగిందంటే..
వికారాబాద్ జిల్లా పరిగి మండలం చౌదరిగూడ గ్రామానికి చెందిన ప్రభావత్ లాల్యానాయక్ ఒక నిరుపేద కుటంబం నుంచి ఎదిగారు. ప్రభుత్వ హాస్టల్ లో ఉంటూ ఇంటర్ పూర్తి చేసి.. తర్వాత పాల్వంచలో డిగ్రీ పూర్తి చేశారు. ఎంఏ బీఈడీ పూర్తి చేసిన అనంతరం పరిగిలోని ఒక ప్రైవేటు జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా చేరారు. కొవిడ్ వేళ.. కాలేజీ మూతపడటంతో జాబ్ పోయింది. దీంతో ఉపాధిని కోల్పోయారు. పట్టుదలతో పోటీ పరీక్షలకు సిద్దమై 2020లో కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు.
ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. అయితే. లాల్యా నాయక్ లెక్చరర్ గా చేసే సమయంలో మరో నిరుపేద కుటుంబ నేపథ్యం ఉన్న జబీనా బేగం ఇంటర్ లో చేరారు. చదువులో చురుగ్గా ఉండే జబీనాను లాల్యానాయక్ ప్రోత్సహించారు. సెకండ్ ఇయర్ర లో ఆమెకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్న విషయాన్ని తెలుసుకొని.. వారితో మాట్లాడి పెళ్లి ప్రయత్నాన్ని విరమించేలా చేశారు.
ఇంటర్ పూర్తి అయ్యాక డిగ్రీ చదివే వరకు ఆమెకు అండగా నిలిచారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న శిష్యురాలికి అండగా నిలిచారు. సలహాలు ఇచ్చేవారు. గురువు ప్రోత్సాహం.. శిష్యురాలి పట్టుదల కలిపి ఆమె ఎస్ఐగా 2024లో జరిగిన పరీక్షలో ఎంపికయ్యారు. ఏడాది ట్రైనింగ్ పూర్తి చేసుకున్నఆమెకు బుధవారం ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. అది కూడా తన గురువు కానిస్టేబుల్ గా పని చేస్తున్న మొయినాబాద్ పోలీస్ స్టేషేన్ లో. దీంతో.. తన పై అధికారిగా స్టేషన్ కు వచ్చిన శిష్యురాలికి.. కానిస్టేబుల్ గా పని చేస్తున్న లాల్యానాయక్ స్టేషన్ గుమ్మం వద్దే సెల్యూట్ చేసిన వైనం అందరిని ఆకట్టుకుంది.