ఒక్కొక్కటిగా వెలుగులోకి మస్తాన్ సాయి మాయలు.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులు?
సినీ హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో సంచలన వీడియోలతో పోలీసులకు పట్టుబడిన మస్తాన్ సాయి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
By: Tupaki Desk | 4 Feb 2025 11:20 AM GMTసినీ హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసులో సంచలన వీడియోలతో పోలీసులకు పట్టుబడిన మస్తాన్ సాయి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మహిళలకు మాయ మాటలు చెప్పి మోసం చేయడంతోపాటు రహస్యంగా వారి నగ్న వీడియోలు చిత్రీకరించాడని మస్తాన్ సాయిపై లావణ్య ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ ను వెంటనే స్వాధీనం చేసుకోవాలని లావణ్య పోలీసులను కోరారు.
లావణ్య ఇచ్చిన సమాచారంతో మస్తాన్ సాయి ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు మహిళల అశ్లీల వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో సుమారు 200వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియోల విషయం బాధిత మహిళలకు తెలిసినా, మస్తాన్ సాయి ఏం చేస్తాడనే భయంతో ఇన్నాళ్లు ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదని చెబుతున్నారు. ఎట్టకేలకు లావణ్య తనను కూడా మస్తాన్ సాయి బెదిరించి వీడియో తీశాడని, తనకు జరిగిన అన్యాయం ఇంకొకరి జరగకూడదనే ఉద్దేశంతో ఫిర్యాదు చేశానని చెబుతున్నారు. లావణ్య ఫిర్యాదుతో మస్తాన్ సాయి అరెస్టు కావడంతో అతడిపై కంప్లెయింట్స్ ఇవ్వడానికి మరింత మంది బాధితులు పోలీసు స్టేషన్ కు క్యూకడుతున్నారు.
గతంలో అతడిపై ఫిర్యాదు చేయడానికి వెళితే ఆత్మహత్య చేసుకుంటానని మస్తాన్ సాయి బెదిరించేవాడని బాధిత మహిళలు చెబుతున్నారు. కొందరికి వీడియో కాల్ చేసి ఉరి వేసుకుంటున్నట్లు భయపెట్టేవాడని, వాటి తాలుకా వీడియో క్లిప్పులు కూడా ఇప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. సినీ హీరో రాజ్ తరుణ్-లావణ్య కేసులో తొలిసారిగా మస్తాన్ సాయి తెరపైకి వచ్చాడు. లావణ్య స్నేహితుడిగా చెప్పుకున్న మస్తాన్ సాయి ఆమెను అడ్డుపెట్టుకుని రాజ్ తరుణ్ ను భయపెట్టాలని చూసేవాడని ప్రచారం జరుగుతోంది. మరోవైపు తన వద్ద ఉన్న హార్డ్ డిస్క్ లో రాజ్ తరుణ్ కు సంబంధించిన కొన్ని సాక్ష్యాలు ఉన్నాయని, వాటిని నాశనం చేయడానికే లావణ్య డ్రామా ఆడుతోందని మస్తాన్ సాయి ఆరోపిస్తున్నాడు.
అయితే మస్తాన్ సాయి గత చరిత్ర ఆధారంగా పోలీసులు అతడి మాటలను విశ్వసించడం లేదు. మస్తాన్ సాయిపై ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక డ్రగ్స్ కేసు కూడా ఉంది. హైదరాబాద్ లో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేంద్రంగా పలువురు యువతీ, యువకులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు మస్తాన్ సాయిపై ఆరోపణలు ఉన్నాయి.