రేవంత్ సొంత జిల్లాలో కాంగ్రెస్ చేజారిన ఎమ్మెల్సీ.. బీఆర్ఎస్ కు అనూహ్య విజయం
సరిగ్గా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను తన చేతుల మీదుగా జరుపుతున్న వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని ఇబ్బంది తలెత్తింది
By: Tupaki Desk | 2 Jun 2024 6:23 AM GMTసరిగ్గా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను తన చేతుల మీదుగా జరుపుతున్న వేళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని ఇబ్బంది తలెత్తింది. సొంత జిల్లాలో ఆయన పార్టీకి పరాజయం ఎదురైంది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి పరాజయం పాలయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం గమనార్హం.
అసలేం జరిగింది?
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కసిరెడ్డి నారాయణరెడ్డి ఉండేవారు. ఆయన కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే, బీఆర్ఎస్ లో అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యేగానూ గెలిచారు. దీంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. మార్చి 28న పోలింగ్ జరగ్గా.. ఏప్రిల్ 2న ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. కానీ, అప్పటికే లోక్ సభ ఎన్నికల కోడ్ రావడంతో ఫలితాలను విడుదల చేయలేదు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు దేశవ్యాప్తంగానూ ముగియడంతో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపును ఆదివారం మొదలుపెట్టారు.
బీఆర్ఎస్ అనూహ్య విజయం?
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన నవీన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 111 ఓట్లతో గెలిచారు. నవీన్ కు 763, జీవన్ కు 652 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థికి ఒక ఓటు వచ్చింది. మొదటి ప్రాధాన్య ఓట్లతోనే మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం తేలిపోయింది. దీంతో ద్వితీయ ప్రాధాన్య ఓట్లను లెక్కించాల్సిన పనిలేకపోయింది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అంటే.. ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు ఓటర్లుగా ఉండే నియోజకవర్గం. వాస్తవానికి ఈ స్థానంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఎక్కువ మంది ఆ పార్టీ వారే గెలిచారు. సహజంగానే ఆ పార్టీకే ఓట్లు ఎక్కువగా ఉంటాయి. కాంగ్రెస్ ఆరు నెలల కిందట అధికారంలోకి వచ్చింది కాబట్టి.. వచ్చే స్థానిక ఎన్నికలపై ఫోకస్ పెడుతుంది.