మాయావతి డెసిషన్ అంటే అంతే !
వెనకటికి ఎన్టీఆర్ నటించిన సినిమా యమగోలలో ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదు అన్న డైలాగు ఉంటుంది.
By: Tupaki Desk | 7 Dec 2024 4:04 AM GMTవెనకటికి ఎన్టీఆర్ నటించిన సినిమా యమగోలలో ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలకూడదు అన్న డైలాగు ఉంటుంది. అది గ్రామ కక్షలకు నిదర్శనం. అయితే రాజకీయాలో కక్షలకు ఆస్కారం లేదు. రాజకీయం అంటేనే ప్రజా సేవ. ప్రజల కోసం వారి తరఫున చేసే సేవలో ఎవరికి వారు పోటీ పడాల్సి ఉంటుంది.
అపుడు వారు ప్రత్యర్థులు అవుతారు తప్ప శత్రువులు కారు. ఇది రాజకీయాలకు అసలైన అర్ధం. కానీ గత కొన్ని దశాబ్దాలుగా చూస్తే ఈ అర్థాలు చాలా మారిపోయాయి. రాజకీయాల్లో అవతల పార్టీ నీడ తాకేందుకు కూడా నేతలు ఇష్టపడడం లేదు. ఎగస్పార్టీ వారిని పూర్తిగా బద్ధ విరోధులుగానే చూస్తున్నారు.
దాంతోనే చిక్కు వస్తోంది. ఇక ప్రజాస్వామ్యం అనే అందమైన బంధానికి ఇబ్బంది వస్తోంది. ఇది అలా అన్ని చోట్లా అన్ని పార్టీలలోనూ జరుగుతోంది. విపక్ష నేతలతో ముచ్చట్లు పెట్టడం వారి ఇంటికి వెళ్లడం వారిని సభలో గౌరవంగా చూడడం వారు చెప్పే సలహాలు సూచనలు వినడం అన్నది వెనకటి రోజులలో ఉన్న మంచి సంప్రదాయం. ఇపుడు అవి ఉన్నాయా అంటే మచ్చుకైనా ఎక్కడా కనిపించడంలేదు.
ఈ నేపధ్యంలో చూస్తే బీఎస్పీ అధినేత్రి మాయావతి తమ పార్టీ నేత మీద చర్యలు తీసుకున్నారు. ఆయన ఇంతకీ చేసిన తప్పేంటి అంటే ఆయన తన కుమారుడికి సమాజ్ వాదీ పార్టీ నేత కుమార్తెతో పెళ్ళి జరిపించడం అని అంటున్నారు. ఎస్పీకి చెందిన ఎమ్మెల్యే భువనేశ్వర్ దత్ కుమార్తెతో బీఎస్పీ కి చెందిన సురేంద్ర సాగర్ తన కుమారుడికి పెళ్ళి చేశారు. దాంతో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు అని మాయావతి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
ఇక ఇలా మాయావతి చేత సస్పెన్షన్ కి గురి అయిన బీఎస్పీ నేత సురేంద్ర సాగర్ ఆ పార్టీలో సీనియర్ నేత అని అంటున్నారు. ఆయన రాంపూర్ జిల్లా అధ్యక్షుడిగా అయిదు సార్లు పనిచేశారు. ఆ ప్రాంతంలో ఆయనకు మంచి నాయకుడిగా పేరుంది. అయితే రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ఎస్పీ నేతతో సురేంద్ర సాగర్ అనుబంధాన్ని పెనవేసుకోవడమే మాయావతికి నచ్చలేదని అందుకే ఈ వేటు పడింది అని అంటున్నారు.
ఇక ఇక్కడ మరో విషయం కూడా ఉంది. ఎస్పీ చీఫ్ అయిన అఖిలేష్ యాదవ్ కూడా ఈ పెళ్ళికి హాజరు అయ్యారు. అలా బీఎస్పీ ఎస్పీ నేతల మధ్య కుదిరిన ఈ వివాహ బంధం యూపీలో రాజకీయంగా వైరల్ కూడా అయింది. దీని మీదనే మాయావతి ఈ చర్యలు తీసుకున్నారని అంటున్నారు.
ఇదిలా ఉంటే తన మీద బీఎస్పీ అధినేత్రి మాయావతి చర్యలు తీసుకోవడాన్ని సురేంద్ర సాగర్ ఖండించారు. తాను ఇందులో ఏ తప్పూ చేయలేదని అంటున్నారు. నా కుమారుడికి ఎస్పీ నేత కుమార్తెతో పెళ్ళి చేయడమే నేను చేసిన చర్య అని ఆయన అంటున్నారు. అయితే ఎస్పీకి బీఎస్పీకి మధ్య రాజకీయంగా వైరం ఉన్న నేపధ్యంలో అక్కడి నుంచి వివాహ బంధం కలుపుకున్నందుకే ఈ డెసిషన్ అని బీఎస్పీ నుంచి వినిపిస్తోంది. ఏది ఏమైనా ఇది మాత్రం ఇపుడు జాతీయ స్థాయిలోనూ హాట్ టాపిక్ అవుతోంది.