బీఎస్పీని చీల్చే కుట్ర.. మేనల్లుడిని సాగనంపిన మాయావతి
ఆకాష్ ఆనంద్‌కు పార్టీ షోకాజ్ నోటీసు పంపగా ఆయన స్పందన ‘స్వార్థపూరితమైనది, అహంకారపూరితమైనది’ అని మాయావతి తీవ్రంగా విమర్శించారు.
By: Tupaki Desk | 3 March 2025 10:57 PM IST‘చేసిన డ్యామేజ్ చాలు.. ఇక పార్టీ నుంచి దయచేయు’ అంటూ సొంత మేనల్లుడినే బీఎస్పీ నుంచి బహిష్కరించి షాక్ ఇచ్చింది ఆ పార్టీ అధినేత్రి మాయావతి. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి తీసుకున్న ఈ సంచలన నిర్ణయం చర్చనీయాంశమైంది. తన రాజకీయ వారసుడిగా ప్రచారం సాగిన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీలోని అన్ని పదవుల నుంచి ఆయనను తొలగించిన మరుసటి రోజునే ఈ నిర్ణయం ప్రకటించారు. ఆకాష్ ఆనంద్‌కు పార్టీ షోకాజ్ నోటీసు పంపగా ఆయన స్పందన ‘స్వార్థపూరితమైనది, అహంకారపూరితమైనది’ అని మాయావతి తీవ్రంగా విమర్శించారు.
- ఆశోక్ సిద్ధార్థ్ ప్రభావం
మాయావతి ప్రకటన ప్రకారం.. ఆకాష్ ఆనంద్‌పై ఇప్పటికే బహిష్కరించబడిన మామ అశోక్ సిద్ధార్థ్ ప్రభావం ఉన్నట్లు స్పష్టమైంది. ‘‘ఆకాష్ తన చర్యలపై పశ్చాత్తాపం చెంది, రాజకీయ పరిపక్వతను ప్రదర్శించాలి. కానీ ఆయన అందుకు విరుద్ధంగా మామ అశోక్ తో కలిసి పార్టీని విభజించాలని కుట్ర చేస్తున్నారు. ఇది పశ్చాత్తాపం కాదు, స్వార్థం.. అహంకారానికి నిదర్శనం’’ అని మాయావతి ఎక్స్‌లో పేర్కొన్నారు.
- బీఎస్పీ పునాది విలువలు
బాబా సాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ ఆత్మగౌరవ ఉద్యమం, బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ అనుసరించిన క్రమశిక్షణా సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని, ఆకాష్ ఆనంద్‌ను పార్టీ నుంచి బహిష్కరించడం అనివార్యమైందని మాయావతి తెలిపారు. మామ అశోక్ సిద్ధార్థ్‌ను బహిష్కరించిన విధంగానే ఆకాష్ ఆనంద్ విషయంలో కూడా అదే నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
- బహుజన్ సమాజ్ పార్టీలో విభజన కుట్ర
ఇటీవల మాయావతి, ఆకాష్ ఆనంద్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉత్తరప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా బీఎస్పీని రెండు వర్గాలుగా విభజించేందుకు కుట్ర జరుగుతోందని, అందులో ఆకాష్ ఆనంద్ కూడా భాగస్వామి అయ్యారని ఆరోపించారు. ఇది పూర్తిగా సహించరానిదని ఆమె తేల్చి చెప్పారు. ఆదివారం జరిగిన బీఎస్పీ సమావేశంలో పార్టీకి సంబంధించిన అన్ని పదవుల నుంచి ఆకాష్ ఆనంద్‌ను తొలగించినట్లు ప్రకటించారు.
ఈ నిర్ణయం బీఎస్పీ రాజకీయాలలో కొత్త మలుపు తీసుకొచ్చింది. ఆకాష్ ఆనంద్ భవిష్యత్తు రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, మాయావతి నిర్ణయం బీఎస్పీ శ్రేణుల్లో కొత్త దిశను నిర్దేశించబోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.