షేన్ వార్న్ తో పోటీపడిన ఆ మేటి క్రికెటర్ భారీ డ్రగ్స్ కేసులో..
మెక్ గిల్ కు భారీమొత్తం కొకైన్ ను సరఫరా చేసేందుకు వేసిన పథకంలో ప్రమేయం ఉందంటూ కేసు నమోదైంది.
By: Tupaki Desk | 17 Sep 2023 12:30 AMఆస్ట్రేలియా క్రికెట్ లో అత్యంత గొప్ప క్రికెటర్ షేన్ వార్న్. లెగ్ స్పిన్ కళకే కళ తెచ్చిన వార్న్ దాదాపు 15 ఏళ్లు ప్రపంచ క్రికెట్ పై తన ముద్ర చాటాడు. ఏడాది కిందట అతడుంగా అనూహ్య మరణించడం అభిమానులను కలచివేసింది. మళ్లీ వార్న్ అంతటి క్రికెటర్ పుట్టడం అసాధ్యం అని అప్పట్లో అందరూ అన్నారు. అయితే, వార్న్ క్రీడా చరిత్రలోనూ అనేక మచ్చలున్నాయి. ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న సందర్భం కూడా ఉంది. అయితే, వార్న్ ఆస్ట్రేలియా జట్టులో ఉన్నంత కాలం మరొక స్పిన్నర్ కు అవకాశాలు పెద్దగా దక్కలేదు. కానీ అలాంటి సమయంలోనూ ఓ స్పిన్నర్ తన ముద్ర చాటాడు. ఓ దశలో వార్న్ ను మరిపించాడు. అది కూడా మామూలుగా కాదు.. కేవలం 44 టెస్టుల్లోనే 200 పైగా వికెట్లు పడగొట్టగాడు. కానీ, వార్న్ తిరిగి వచ్చాక అతడికి స్థానం దక్కడం కష్టమైంది.
ఆసీస్ క్రికటర్ స్టువర్ట్ మెక్ గిల్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు. వార్న్ తర్వాత మంచి ప్రతిభావంతుడైన లెగ్ స్పిన్నర్ గా పేరుతెచ్చుకున్న మెక్ గిల్ 1998-2008 మధ్య ఆసీస్ కు టెస్టు క్రికెట్ ఆడాడు. 44 మ్యాచ్ లలో 208 వికెట్లు పడగొట్టాడు. 12 సార్లు 5 పైగా వికెట్లు తీశాడు. ప్రస్తుతం 52 ఏళ్ల వయసున్న మెక్ గిల్ 2008లోనే చివరి టెస్టు ఆడాడు. మూడు వన్డేల్లో ఆసీస్ కు ప్రాతినిధ్యం వహించిన మెక్ గిల్ ఆపై ఎక్కువ కాలం పరిమిత క్రికెట్ లో లేడు. అయితే, రిటైర్మెంట్ తర్వాత చాలామంది క్రికెటర్లలాగే మెక్ గిల్ కామెంటేటర్ గా కొనసాగాడు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. మెక్ గిల్ కు భారీమొత్తం కొకైన్ ను సరఫరా చేసేందుకు వేసిన పథకంలో ప్రమేయం ఉందంటూ కేసు నమోదైంది. ఇవే ఆరోపణలతో గత మంగళవారం అతడిని సిడ్నీలో పోలీసులు అరెస్ట్ చేశారు.
రెండేళ్ల కిందట కిడ్నాప్ కలకలం..
మెక్ గిల్ క్రీడా జీవితం కంటే క్రీడేతర జీవితమే చాలా సంక్లిష్టంగా ఉన్నట్లుంది. రెండేళ్ల కిందట అతడిని ఎవరో కిడ్నాప్ చేసి కొట్టినట్టినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. ఇప్పుడు డ్రగ్స్ ఆరోపణలు చుట్టుముట్టాయి. ఇందులో తన ప్రమేయానికి సంబంధించిన ఆరోపణలను గిల్ గతంలోనే ఖండించాడు. అప్పట్లో కిడ్నాప్ అనంతరం సిడ్నీ శివారులోని క్రెమోర్న్‌లో దుండగులు బలవంతంగా కారులోకి ఎక్కించి తీసుకెళ్లారని పోలీసులకు గిల్ చెప్పాడు. ఆ తర్వాత ఆయన అంతర్జాతీయంగా వార్తల్లోకెక్కాడు. నగర శివారులోని మారుమూల ప్రాంతానికి కారులో తీసుకెళ్లి కొట్టారని, గన్‌ను గురిపెట్టి చంపుతామని బెదిరించారని అతడు పోలీసులకు తెలిపాడు. తర్వాత మరోచోట వదిలేసి వెళ్లాడని పేర్కొన్నాడు. కాగా, ఆ ఘటనలో మెక్ గిల్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఇక కిడ్నాప్ తర్వాత ఒక ఇంటర్వ్యూలో మెక్ గిల్ మాట్లాడుతూ, తాను ఏ తప్పూ చేయలేదని తెలిపాడు. విషయం ఏమంటే.. పోలీసులు కూడా మెక్ గిల్ ను నాడు ఓ బాధితుడిగా తెలిపారు. ఆరుగురిపై అభియోగాలు నమోదు చేశారు. విచిత్రం ఏమంటే.. ఇందులో మెక గిల్ మాజీ భాగస్వామి సోదరుడు కూడా ఉన్నారు.
కేసు మెడకు చుట్టుకుంటోందా?
కిడ్నాప్ కేసు నమోదై న రెండేళ్ల దర్యాప్తు తర్వాత పోలీసులు ఇప్పుడు మెక్ గిల్ పై కూడా నేరారోపణలు మోపారు. భారీ మొత్తంలో నిషేధిత మాదక ద్రవ్యం సరఫరాలో అతడు పాల్గొన్నట్లు ఆరోపించారు. ఈ డీల్ రూ.2.49 కోట్లకు పైగా విలువ చేసే కొకైన్‌కు సంబంధించినదని స్థానిక మీడియా పేర్కొంది. అయితే, మెక్ గిల్ బెయిల్‌పై విడుదలయ్యాడు. వచ్చే నెల 26న వాయిదా ఉండడంతో అతడు కోర్టుకు హాజరవనున్నాడు. కాగా, ఒకానొక సమయంలో ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు మెక్ గిల్. వార్న్ తిరిగి రాకుంటే కనీసం 400 వికెట్లు తీయగలిగేవాడు. ఓ దశలో వార్న్ తో కలిసి కూడా టెస్టులు ఆడాడు. ఇద్దరిలో ఎవరినీ పక్కనపెట్టలేక ఇద్దరినీ ఆడించారు. అయితే వార్న్ ప్రభ ముందు తర్వాతి కాలంలో మెక్ గిల్ వెనుకబడిపోయాడు. 44 టెస్టులే ఆడాడు. ఆ వ్యవధిలోనే 200 వికెట్లు తీసి ప్రత్యేకత చాటుకున్నాడు.