Begin typing your search above and press return to search.

భూమికి శుభవార్త... ప్లాస్టిక్ తో విందు చేస్తే పర్యావరణ రక్షకులు!

ఈ ప్రకృతిలో ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుందనే విషయానికి బలం చేరుస్తూ.. ప్లాస్టిక్ ను తినే బగ్స్ అంశం తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   3 Dec 2024 4:15 AM GMT
భూమికి శుభవార్త... ప్లాస్టిక్  తో విందు చేస్తే పర్యావరణ రక్షకులు!
X

పర్యావరణానికి ప్లాస్టిక్ ఎంత పెనుముప్పు అనేది తెలిసిన విషయమే. ఎప్పటికైనా భూమిపై మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారితే.. అందుకు గల కారణాల్లో ప్లాస్టిక్ కూడా ఒకటని అంటుంటారు. ఈ నేపథ్యంలో.. ఈ ప్రకృతిలో ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుందనే విషయానికి బలం చేరుస్తూ.. ప్లాస్టిక్ ను తినే బగ్స్ అంశం తెరపైకి వచ్చింది.

అవును... ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణంపై నానాటికీ భారంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. వీటి నిర్మూలనకు సరికొత్త పరిష్కారాలను కనుగొనవలసిన అవసరం కూడా పెరుగుతోంది. ఈ సమయంలో... కీటకాలను ఉపయోగించి ప్లాస్టిక్ ను భూమినుంచి త్వరగా నిర్మూలించేందుకు మీల్ వార్మ్ అనే పురుగులు సాయపడతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఈ క్రమంలో... బెల్ గ్రేడ్ కు చెందిన బెలిండా యానిమల్ట్స్ డూ, 'సినిసా స్టాంకోవిక్' ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ రీసెర్చ్ ల సంయుక్త మార్గదర్శక ప్రయత్నాలూ ఇందుకు సహకరిస్తున్నాయని అంటున్నారు. ఈ సందర్భంగా... అనేక రకాల ప్లాస్టిక్ లను క్షీణింపచేసే సామర్థ్యాన్ని మీల్ వార్మ్ లార్వా కలిగి ఉంటుందని చెబుతున్నారు.

ఈ కీటకాలను సినిసా స్టాంకోవిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ రీసెర్చ్ దశాబ్ధాలుగా పెంచుతోంది. వీటిని ప్రయోగశాల ఆధారిక, స్వీయ స్థిరమైన కీటకాల జనాభాగా పరిగణించి.. ఇంక్యుబేటర్ సెంటర్ ను ఏర్పాటు చేయడం ప్రారంభించింది.. ఈ రకమైన లార్వాల పెంపకం తమకు తెలుసని వెల్లడించింది.

ఈ ప్రాసెస్ లో లార్వా ప్లాస్టిక్ లను ఆహారంగా తీసుకుంటుందని.. వాటి జీర్ణవ్యవస్థలోని సూక్షజీవ సహాయంతో దాన్ని పూర్తిగా ప్రాసెస్ చేస్తుందని.. తిన్న తర్వాత ఆ లార్వాలో ఎలాంటి ప్లాస్టిక్ ముక్కలు ఉండకుండా జీర్ణమైపోతుందని.. ఫలితంగా, వాటి విసర్జన కూడా ప్లాస్టిక్ లేదా హానికరమైన పదార్థాలను కలిగి ఉండదని చెబుతున్నారు.

దీంతో... వీటి విసర్జనను సేంద్రీయ కంపోస్ట్ గా కూడా ఉపయోగించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ ప్రాసెస్ పూర్తిగా పర్యావరణపరంగా స్థిరమైనదైనప్పటికీ.. ప్రత్యేక పరిస్థితులు అవసరం లేనప్పటికీ.. అధిక ఖర్చుతో కూడుకున్నదని చెబుతున్నారు.