Begin typing your search above and press return to search.

మళ్లీ పాత చంద్రబాబే....అనుకూల మీడియా పెదవి విరుపు

ఏపీ సీఎం చంద్రబాబు తనతో పాటు మరో రెండు పార్టీలను కలుపుకుని కూటమి పేరుతో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

By:  Tupaki Desk   |   16 Dec 2024 4:10 AM GMT
మళ్లీ పాత చంద్రబాబే....అనుకూల మీడియా పెదవి విరుపు
X

ఏపీ సీఎం చంద్రబాబు తనతో పాటు మరో రెండు పార్టీలను కలుపుకుని కూటమి పేరుతో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు పూర్తి అయ్యాయి. ఈ ఆరు నెలల పాలన మీద టీడీపీ అనుకూల మీడియాగా ముద్రపడిన ఒక ప్రముఖ మీడియా సంస్థ పోస్ట్ మార్టం చేసింది. అందులో పెదవి విరుపులే విరిచింది.

మళ్లీ పాత చంద్రబాబే అంటూ అనుకూల మీడియా వేడి నిట్టూర్పులూ విడిచింది. చంద్రబాబు పాలన అంటే పవర్ పాయింట్ ప్రజెంటెషన్లు అధికారులను పెట్టుకుని గంటల కొద్దీ సమీక్షలు ఇవన్నీ గతంలో చేసినవే అని గుర్తు చేసింది. క్లుప్తంగా చెప్పాలీ అంటే క్షణం తీరిక లేదు దమ్మిడీ ఆదాయం లేదు అన్నట్లుగా ఆరు నెలల పాలన సాగిందని అంటూ పోస్టు మార్టం రిపోర్టుని రిలీజ్ చేసింది.

నరేంద్ర మోడీ బయటకు ప్రశాంతంగా ఉంటారని అయితే ఆయన ఎపుడేది చేయాలో అది చేస్తారని పేర్కొంది.పవర్ పాయింట్ ప్రజంటేషన్లతో గంటల తరబడి అధికారులను విసిగించడం నరేంద్ర మోడీ లాంటి వారు చేయడం లేదని కూడా ఎత్తిపొడించింది. బాబు మాత్రం అలాగే చేస్తున్నారని కాలయాపన తప్ప దాని వల్ల ఒరిరేది లేదని అన్నారు. ఇక విజన్ డాక్యుమెంట్ 2047 అంటూ బాబు ఎంతో గొప్పగా విడుదల చేసిన దానిని కూడా ఈ అనుకూల మీడియా తప్పుపట్టడం విశేషం.

రేపటి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని మాత్రమే పనిచేయాలి తప్ప ఇవన్నీ అనవసరం అన్నట్లుగానే ఆ మీడియా చెప్పుకొచ్చింది. జగన్ అధికారంలో ఉన్నపుడు ఎన్నో అరాచకాలు చేసిన నేతలు అంతా ఇపుడు అధికారంలోకి టీడీపీ రాగానే ఆ పార్టీలో చేరి అదే తీరుని కొనసాగిస్తున్నారని తేడా ఏముందని కూడా సదరు మీడియా సంస్థ ప్రశ్నిస్తోంది.

మొత్తానికి చంద్రబాబు అరు నెలల పాలన మీద అనుకూల మీడియా పూర్తిగా నెగిటివ్ ధోరణిలోనే ఈ పోస్ట్ మార్టం రిపోర్టు ఇవ్వడం పట్ల చర్చ సాగుతోంది. అంతే కాదు హామీల గురించి కలెక్టర్ల సమావేశంలో ఎవరూ గుర్తు చేయలేదా అని కూడా కమెంట్ చేసింది. ఇదే తీరుగా వెళ్తే మాత్రం మళ్లీ జగన్ అధికారంలోకి వస్తారని ఆ పాపం పూర్తిగా బాబుదే అవుతుందని కూడా హెచ్చరించింది.

మరి ఆరు నెలల పాలనలో ఎన్నో చేసామని కూటమి పెద్దలు చెప్పుకొస్తున్నారు. అంతా బాగుంది ఫీల్ గుడ్ అని ఒకరికి ఒకరు అభినందించుకుంటున్నారు. టీడీపీకి గట్టిగా మద్దతు ఇచ్చే ఆ మీడియా మాత్రం బాబుని హెచ్చరించే తీరులోనే ఈ విధంగా కామెంట్స్ చేయడం చూస్తూంటే బాబు పాలనలో మొదటి ఆరు నెలలూ అంతా చప్పచప్పగా సాగిందా అన్న కొత్త చర్చ అయితే బయల్దేరింది.