Begin typing your search above and press return to search.

ఔటర్ లో కారులో వెళుతూ విషంతో ప్రాణాలు తీసుకున్న డాక్టర్

షాకింగ్ ఉదంతం హైదరాబాద్ మహానగర శివారులో చోటు చేసుకుంది. ఈ విషాదం గురించి విన్నంతనే బోలెడన్ని సందేహాలు తలెత్తే పరిస్థితి.

By:  Tupaki Desk   |   14 Feb 2024 5:45 AM GMT
ఔటర్ లో కారులో వెళుతూ విషంతో ప్రాణాలు తీసుకున్న డాక్టర్
X

షాకింగ్ ఉదంతం హైదరాబాద్ మహానగర శివారులో చోటు చేసుకుంది. ఈ విషాదం గురించి విన్నంతనే బోలెడన్ని సందేహాలు తలెత్తే పరిస్థితి. కష్టపడి డాక్టర్ చదువు పూర్తి చేసి.. పీజీ కోర్సు చేస్తున్న ఆమె త్వరలోనే ఆ కోర్సును కూడా పూర్తి చేయనుంది. అలాంటి మెడికో కం డాక్టర్ రచనారెడ్డి ఔటర్ రింగు రోడ్డు మీద కారులో వెళుతూ విష ఇంజక్షన్ తో ప్రాణాలు తీసుకున్న వైనం సంచలనంగా మారింది.

ఆమెకు ఆమే ప్రాణాలు తీసుకున్నారా? లేదంటే ఇంకేమైనా జరిగిందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అవుటర్ రింగ్ రోడ్డులో కారులో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఆమెను వాహనదారులు గమనించి అమీన్ పూర్ పోలీసులకు ఫోన్ లో సమాచారం అందించారు. దీంతో స్పందించిన పోలీసులు అంబులెన్సులో వెళ్లి.. ఆమెను తీసుకొని బాచుపల్లి మమతా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాలుగు గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచినట్లుగా చెబుతున్నారు.

సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో నివాసం ఉండే రచనారెడ్డి ఖమ్మం పట్టణంలోని మమతా మెడికల్ కాలేజీలో పీజీ కోర్సు చేస్తున్నారు. పీజీ ఇంటర్న్ షిప్ లో భాగంగా మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లిలో ఉన్న మమతా మెడికల్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో పీజీ కోర్సు పూర్తి చేయనున్న ఆమె.. తన కారులో అపస్మారక స్థితిలో పడి ఉన్న విషయాన్ని మంగళవారం ఉదయం 9గంటల ప్రాంతంలో ఔటర్ రింగు రోడ్డు సుల్తాన్ పూర్ ప్రాంతంలో గమనించారు. ఘటనా స్థలానికి అమీన్ పూర్ పోలీసులు చేరుకునే సమయానికి ఆమె కొన ఊపిరితో ఉన్నారు. దీంతో.. ఆమెను దగ్గర్లోని మమతా ఆసుపత్రికి (బాచుపల్లి) తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

విష ఇంజక్షన్ ను తీసుకొని ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చెబుతున్నారు. ఆమె తల్లిదండ్రులు బీహెచ్ ఈఎల్ కు దగ్గర్లోని రామచంద్రాపురంలో నివాసం ఉంటున్నారు. తమ కుమార్తెకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతున్నారు. దీంతో అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నారా? ఎందుకు చేసుకున్నారు? కారణం ఏమిటి? కారులో ఒక్కరే బయలుదేరారా? ఆమె వెంట ఎవరైనా ఉన్నారా? లాంటి కోణాల్లో పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ఆమె కారులోని డ్రైవర్ సీటులో ఉండటం.. సీటుబెల్టు పెట్టుకొని ఉన్నట్లుగా చెబుతున్నారు. చేతికి కాన్యులా ఉండటంతో ఇంజక్షన్ రూపంలో విషాన్నితీసుకొని ఉంటుందని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరిన్ని వివరాలు తెలిసే వీలుందని చెబుతున్నారు.