Begin typing your search above and press return to search.

కుంగిన బ్యారేజీ వంతెన... రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల నిలిపివేత!

మహారాష్ట్ర - తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ బ్యారేజీ పైనుంచి రాకపోకలు నిలిపివేశారు.

By:  Tupaki Desk   |   22 Oct 2023 6:21 AM GMT
కుంగిన బ్యారేజీ వంతెన... రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల నిలిపివేత!
X

రోజూలాగానే శనివారం కూడా పొద్దుపోయింది! ఈ సమయంలో ఒక భారీ శబ్ధం..!! ఏమి జరుగుతుందో తెలుసుకునే లోపు కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ వంతెన ఒక్కసారిగా కుంగిపోయింది! ఎవరూ ఊహించని విధంగా... భారీ శబ్దంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన సుమారు ఒక అడుగు మేర కుంగిపోయింది. దీంతో అలర్ట్ అయిన నీటిపారుదల శాఖ ఇంజినీర్లు... మహారాష్ట్ర - తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ బ్యారేజీ పైనుంచి రాకపోకలు నిలిపివేశారు.

అవును... శనివారం సాయంత్రం కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ వంతెన భారీశబ్ధం చేస్తూ ఒక్కసారిగా కుంగిపోయింది! ఈ బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా.. కుంగిపోయిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. దీంతో నీటిపారుదల శాఖ ఇంజినీర్లు డ్యాం పరిసరాల్లో అలర్ట్‌ ప్రకటించారు.

శనివారం రాత్రి సమయానికి ఎగువ నుంచి జలాశయానికి 25 వేల క్యూసెక్కుల వరకు ప్రవాహం వస్తుండగా 8 గేట్లు తెరిచి దిగువకు వదులుతున్నారు. ఈ క్రమంలో పెద్ద శబ్దం రావడంతో ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజినీరు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వారు పరిశీలన చేస్తున్న సమయంలోనూ మరికొన్ని శబ్దాలు రావడంతో వంతెన కుంగిపోయింది.

వాస్తవానికి 16.17 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ బ్యారేజీలో సంఘటన జరిగే సమయానికి 10.17 టీఎంసీల జలాలు ఉన్నాయి. దీంతో ఇంజినీర్లు ముందు జాగ్రత్త చర్యగా జలాశయాన్ని ఖాళీ చేయడం ప్రారంభించారు. మొదట 12 గేట్లు, ఆ తరువాత వాటిని 46కు పెంచి నీటిని దిగువకు విడుదల చేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగా సుమారు 50 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

ఇలా రెండు రాష్ట్రాల సరిహద్దులను కలిపే వంతెన భారీ శబ్దంతో కుంగిపోయిన నేపథ్యంలో డ్యాం ఇంజినీర్లు మహారాష్ట్ర వైపు సిరోంచ, తెలంగాణ వైపు మహదేవపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ఎల్‌ & టీ కాంట్రాక్ట్ సంస్థ నిపుణులకు కూడా సమాచారం అందించారు. వారు శనివారం అర్ధరాత్రికి మేడిగడ్డ చేరుకున్నారు. మరోపక్క సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు రాకపోకలను నిలిపివేశారు.

కాగా... గోదావరి నదిపై 2019లో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో మేడిగడ్డ వద్ద ఈ బ్యారేజీ నిర్మించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది కావడం గమనార్హం. ఈ క్రమంలో... శనివారం రాత్రి సమయానికి ఎగువ నుంచి జలాశయానికి 25 వేల క్యూసెక్కుల వరకు ప్రవాహం వస్తుండగా 8 గేట్లు తెరిచి దిగువకు వదులుతుండగా పెద్ద శబ్ధం వచ్చింది.. అనంతరం వంతెన ఒక అడుగుమేర కుంగిపోయింది.