Begin typing your search above and press return to search.

కేటీఆర్, హరీశ్‌.. చింత చచ్చినా పులుపు చావలేదు!

మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథల పేరుతో కేసీఆర్‌ ప్రభుత్వం గత పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులు మేడిపండు చందమేనని ఒక్కో ప్రాజెక్టు నిరూపిస్తున్నాయి

By:  Tupaki Desk   |   3 March 2024 7:20 AM GMT
కేటీఆర్, హరీశ్‌.. చింత చచ్చినా పులుపు చావలేదు!
X

మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథల పేరుతో కేసీఆర్‌ ప్రభుత్వం గత పదేళ్లలో చేపట్టిన ప్రాజెక్టులు మేడిపండు చందమేనని ఒక్కో ప్రాజెక్టు నిరూపిస్తున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలకు నిలువెత్తు తార్కాణంగా నిలిచిందని స్వయంగా నిపుణులే వ్యాఖ్యానించారు. పిల్లర్లు కుంగిపోయాయి.. గోడలు నెర్రెలిచ్చాయి. నీటి నిల్వకు మేడిగడ్డ బ్యారేజీ పనికిరాదని నిపుణుల బృందం కూడా తేల్చింది.

అయినా కిందపడ్డా చేయి పైనే ఉంది అన్న చందంగా బీఆర్‌ఎస్‌ అగ్ర నేతలు కేటీఆర్, హరీశ్‌ ల వ్యవహార శైలి ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కళ్ల ముందే మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లు భారీ ఎత్తున కనిపిస్తున్నా.. తమ వైఫల్యాన్ని ఒప్పుకోకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పైగా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన మేడిగడ్డ ప్రాజెక్టుకు రిపేర్లు చేయించాలని కేటీఆర్, హరీశ్‌ ఉచిత సలహాలివ్వడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

రెండు రోజుల క్రితం బీఆర్‌ఎస్‌ నేతలు, నిపుణుల బృందాన్ని వెంటేసుకుని కేటీఆర్‌ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల వద్ద హడావుడి చేసిన సంగతి తెలిసిందే. మేడిగడ్డి పిల్లర్లు కుంగిపోయి, ప్రాజెక్టు గోడలు భారీగా నెర్రెలిచ్చి కళ్ల ముందు కనిపిస్తున్నా కేటీఆర్, హరీశ్‌ వాటిని చిన్నవిగా చూపించి మాట్లాడుతుండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

భారీ ఎత్తున నిధులు స్వాహా చేయడంతోపాటు కమీషన్లు దండుకున్నారని.. నాణ్యతాలోపాలతో ప్రాజెక్టులు నిర్మించారని నిపుణులు, అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పైగా తమ తప్పును ఒప్పుకోకుండా వరదలు వచ్చే లోపు, వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు యుద్ధప్రాతిపదికన రిపేర్లు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తుండటం విస్తు గొలుపుతోంది.

కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనంగా మేడిగడ్డ బ్యారేజీ కనిపిస్తున్నా కేటీఆర్, బీఆర్‌ఎస్‌ బృందం రాష్ట్ర ప్రభుత్వానికి సుద్దులు చెప్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, నిపుణుల బృందం మేడిగడ్డ బ్యారేజీ నీటి నిల్వకు పనికిరాదని తేల్చింది. కుంగిన పిల్లర్లకు రిపేర్లు చేయించినా పనికిరావని పేర్కొంది. ఈ నేపథ్యంలో రేవంత్‌ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ప్రయత్నించి కేటీఆర్, హరీశ్‌ ల బృందమే అభాసుపాలయ్యిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ, మరమ్మతుల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. బ్యారేజీని పునరుద్ధరించాలంటే మళ్లీ ఒప్పందం చేసుకోవాల్సిందేనని నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీ స్పష్టం చేసింది. బ్యారేజీలోని ఏడో బ్లాకుపై ఎలక్ట్రోట్‌ రెసిస్టివిటీ టెస్ట్‌లు (ఈఆర్‌టీలు) జనవరి 4 నుంచి 9వ తేదీ మధ్య జరిగిన సంగి తెలిసిందే. దాని ఫలితాలు ఇవ్వడానికి కూడా నిర్మాణ సంస్థ నిరాకరించింది. బ్యారేజీ నిర్మాణం కోసం 2016 ఆగస్టు 26న ఒప్పందం జరిగిందని, నీటిపారుదల శాఖ ఇచ్చిన ఆదేశాలు, డిజైన్లు, డ్రాయింగ్‌ ఆధారంగా నిర్మాణం చేపట్టామని ఆ సంస్థ చెబుతోంది.

2021 మార్చి 15న బ్యారేజీ పనులు పూర్తయినట్లు సంబంధిత అధికారులు సర్టిఫికెట్‌ ఇచ్చారని ఎల్‌ అండ్‌ టీ గతంలోనే స్పష్టం చేసింది. కాఫర్‌ డ్యామ్‌ కట్టాలంటే రూ.55.75 కోట్లు అవుతుందని, ఆ మేరకు ఒప్పందం చేసుకుంటేనే పనులు చేస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీని నాణ్యతా లోపాలతో నిర్మించిందని స్పష్టమవుతోంది.