Begin typing your search above and press return to search.

ఫాక్ట్ చెక్ : ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా మీనాక్షి చౌదరి!... ఎంతవరకూ నిజం?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారత బ్రాండ్ అంబాసిడర్ హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   2 March 2025 2:54 PM IST
ఫాక్ట్ చెక్ : ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా మీనాక్షి చౌదరి!... ఎంతవరకూ నిజం?
X

తెలుగు సినిమాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్స్ లో ఒకరైన మీనాక్షి చౌదరిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబోతోందని శనివారం నుంచి పలు కథనాలు మీడియాలో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక జీవో ఏదీ విడుదల కాకపోయినా ప్రచారం మాత్రం జరిగింది.

ఇందులో భాగంగా... నాడు తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నటి సమంత పనిచేసినట్లుగా, ఏపీలో పూనమ్ కౌర్ ఉన్నట్లుగా.. ఏపీ మహిళా సాధికారత బ్రాండ్ అంబాసిడర్ గా మరోసారి టాలీవుడ్ నటిని నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందని విస్తృత ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది.

అవును... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారత బ్రాండ్ అంబాసిడర్ హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా.. ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ ఎక్స్ వేదికగా దీనిపై స్పష్టత ఇచ్చింది. ఈ ప్రచారం పూర్తిగా ఫేక్ అని తెలిపింది.

ఈ సందర్భంగా... "ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్‌ గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించారని సోషల్ మీడియాలో ప్రచారం పూర్తిగా ఫేక్. ప్రభుత్వం పేరుతో ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపైనా, ఫేక్ ప్రచారం చేస్తున్న వారిపైనా చట్టప్రకారం చర్యలు ఉంటాయి" అని తెలిపింది.

కాగా... ఇటీవల విడుదలైన "సంక్రాంతికి వస్తున్నాం" సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఆమె పేరు మారుమోగిపోతోంది. తొలుత సుశాంత్ హీరోగా దర్శన్ దర్శకత్వంలో "ఇచ్చట వాహనాలు నిలుపరాదు" అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె.. ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్నారు.

అనంతరం రవితేజతో "ఖిలాడీ", "హిట్: ది సెకండ్ కేస్", మహేష్ బాబు "గుంటూరు కారం", తమిళ స్టార్ హీరో విజయ్ "ది గోట్" చిత్రాల్లో హీరోయిన్ గా వరుస ఆఫర్లు దక్కించుకుంది. ఈ సమయంలోనే "లక్కీ భాస్కర్" సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మీనాక్షి చౌదరి స్టార్ గా మారిపోయారు.

ఇక సంక్రాంతికి వస్తున్నా సినిమాతో ఆమె ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా దగ్గరయ్యారు.. ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే.. అది ఫేక్ ప్రచారం అని ఏపీ సర్కార్ క్లారిటీ ఇచ్చింది.