Begin typing your search above and press return to search.

మీనాక్షి.. మీనాక్షి.. కాంగ్రెస్ లో ఇంత సింపుల్ గా ఉన్నారేంటి?

ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామం ఏమంటే.. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా ఉన్న దీపాదాస్ ను తప్పించి ఆమె స్థానంలో మీనాక్షి నటరాజన్ ను నియమించడం..

By:  Tupaki Desk   |   1 March 2025 11:34 AM GMT
మీనాక్షి.. మీనాక్షి.. కాంగ్రెస్ లో ఇంత సింపుల్ గా ఉన్నారేంటి?
X

ఇటీవల కాలంలో తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామం ఏమంటే.. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా ఉన్న దీపాదాస్ ను తప్పించి ఆమె స్థానంలో మీనాక్షి నటరాజన్ ను నియమించడం.. దేశంలో పార్టీ నేరుగా అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కావడంతో కాంగ్రెస్ అధిష్ఠానం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ వస్తోంది. అయితే, కొన్ని కారణాల రీత్యా ఇటీవల నిరసన స్వరాలు పెరుగుతుండడంతో అధిష్ఠానం తక్షణమే దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇందులో భాగంగా మీనాక్షి నటరాజన్ ను పార్టీ వ్యవహారాల బాధ్యురాలిగా పంపింది.

తన నియామకం అనంతరం మీనాక్షి తొలిసారిగా శుక్రవారం హైదరాబాద్ వచ్చారు. కాచిగూడ స్టేషన్ లో ఆమెను కొద్ది మంది పార్టీ నేతలు మాత్రమే రిసీవ్ చేసుకున్నారు. దీనికి కారణం.. మీనాక్షి నిరాడంబరతే. శాలువాలు కప్పబోయినా, బొకేలు ఇవ్వాలని చూసినా మీనాక్షి సున్నితంగా వారించడం గమనార్హం. శాలువాలు కప్పినా ఆమె వెంటనే తీసేశారు.

కాంగ్రెస్ అంటేనే కాస్త హడావుడి ఎక్కువ. అధికారంలో ఉన్న రాష్ట్రానికి ఇంచార్జి అంటే ఇంక ఆ నాయకుడి పర్యటనలో హంగామా మామాలుగా ఉండదు. కానీ, మీనాక్షి నటరాజన్ రైల్లో హైదరాబాద్ వచ్చారు. పంజాబీ డ్రెస్సు, హవాయి చెప్పులు, సాదాసీదా కళ్లజోడుతో చూడగానే ఈమేనా రాష్ట్ర పార్టీ వ్యవహారాలు చూసే నాయకురాలు అనే అనుమానం కలిగింది కూడా.

మీనాక్షి అడుగడుగునా గాంధీయిజాన్ని అనుసరిస్తారు. దీనికి తగ్గట్లే ఫ్లెక్సీలు, కటౌట్లతో ఆర్భాటంగా కనిపించే పార్టీ కార్యాలయం గాంధీ భవన్‌ ను సింపుల్‌ గా మార్చేశారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్ యూఐ నుంచి ఎంపీగా ఎగదిగిన మీనాక్షి పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ బృందంలో కీలక సభ్యురాలు. 51 ఏళ్ల మీనాక్షి అవివాహిత. 1973 జూలై 23న మధ్యప్రదేశ్‌లోని నగ్డాలో జన్మించారు. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాల మండలి సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితురాలు అయిన మీనాక్షికి రూ.67 లక్షల చరాస్తులున్నాయి. మాజీ ఎంపీ పింఛను డబ్బులే ఇందులో ఎక్కువ. ఎమ్మెస్సీ (బయోకెమిస్ట్రీ) చదివిన మీనాక్షి లా కూడా పూర్తి చేశారు. రచయిత్రి కూడా అయిన ఆమె ‘అప్నే అప్నే కురుక్షేత్ర’, ‘1857 భారతీయ పరిపేక్ష’ పేరిట రెండు నవలలు రాశారు. సాధారణ జీవితం, పార్టీ పట్ల అంకితభావాన్ని గమనించిన రాహుల్‌.. 2008లో మీనాక్షిని ఏఐసీసీ కార్యదర్శిగా తన టీమ్ లో చేర్చుకున్నారు. 2009లో మధ్యప్రదేశ్‌ మండసోర్‌ ఎంపీ టికెట్ ఇచ్చారు.

కాచిగూడ స్టేషన్ లో మీనాక్షిని ప్రొటోకాల్‌ ప్రకారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్‌.. రిసీవ్ చేసుకున్నారు. పార్టీ ఏర్పాటు చేసిన కారులో ఆమె దిల్‌ కుషా గెస్ట్‌ హౌస్‌ చేరుకున్నారు. గాంధీ భవన్‌లో టీపీసీసీ విస్తృత సమావేశంలో మాట్లాడుతూ తన దృష్టిలో పడేందుకు నేతలెవరూ ప్రయత్నాలు చేయొద్దని.. ముఖస్తుతి, ఆర్భాటాలు వద్దని గట్టిగా చెప్పారు. తన కోసం రైల్వే స్టేషన్‌ కు ఎవరూ రావొద్దని, తన బ్యాగ్‌ లు మోసే బలం లేకుంటే తానే సాయం అడుగుతానని వ్యాఖ్యానించారు. కార్యకర్తలకు ఏమైనా సమస్యలుంటే తనకు ఫోన్‌ చేస్తే మాట్లాడతానని చెప్పారు. ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోతే.. మిస్డ్‌ కాల్‌ చూసుకునైనా తర్వాతైనా మాట్లాడతానని చెప్పారు.