Begin typing your search above and press return to search.

మీర్ పేట్ మాధవి హత్య కేసు... గురుమూర్తి చూసిన ఓటీటీ సినిమా ఇదే!

మీర్ పేట్ మహిళ వెంకట మాధవి హత్య కేసు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Jan 2025 6:21 AM GMT
మీర్ పేట్ మాధవి హత్య కేసు... గురుమూర్తి చూసిన ఓటీటీ సినిమా ఇదే!
X

మీర్ పేట్ మహిళ వెంకట మాధవి హత్య కేసు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తన భార్యను గురుమూర్తి చంపడం, అనంతరం ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడటం కోసం అంటూ చేసిన ఆటవిక చర్య మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ ఆలోచన రావడానికి అతడు ఓటీటీలో చూసిన సినిమా కారణం అని చెప్పగా.. ఆ సినిమా వివరాలు తాజాగా తెలిసిందని అంటున్నారు!

అవును... మీర్ పేటలో గృహిణి మాధవి హత్య కేసు అంత సంచలనం రేపిందనే సంగతి తెలిసిందే. ఈ కేసులో అనుమానితుడిగా అరెస్టైన గురుమూర్తి.. తన భార్యను తానే హత్య చేసి, ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి, అందులోని మాంసాన్ని ముద్ద చేసి ఫ్లష్ చేసి, ఎముకలను పొడి చేసి చెరువులో పడేసినట్లు చెప్పాడనే విషయం వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

దీంతో... ఆమె మృతదేహానికి సంబంధించిన ఆధారాలు సేకరించడం ఇప్పుడు పోలీసులకు అతి పెద్ద సవాల్ గా మారిందని అంటున్నారు. గతంలో ఇలాంటి కేసులను డీల్ చేసిన అధికారులను ఇతర రాష్ట్రాల నుంచి రప్పిస్తున్నారని తెలుస్తుంది. మరోపక్క గురుముర్తి ఇంటి బాత్ రూమ్ లో ఒక పొడవాటి తల వెంట్రుక దొరకడంతో దాన్ని డీఎన్ఏ టెస్టుకు పంపించినట్లు కథనాలొస్తున్నాయి.

ఈ నేపథ్యంలో.. తన భార్య మృతదేహం ఆచూకీ తెలియకుండా, పోలీసులకు ఆధారాలు దొరక్కుండా చేయడాన్ని ఓటీటీలో ఓ సినిమా చూసి గురుమూర్తి ఇన్స్పైర్ అయినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. అతడు చూసిన సినిమా ఏమిటనే విషయం తెరపైకి వచ్చిందని అంటున్నారు. అది ఓ మళయాళం సినిమా అని అంటున్నారు.

ఇందులో భాగంగా... ఓటీటీలో వచ్చిన "సూక్షదర్శిని" అనే మళయాళం సినిమాను గురుమూర్తి పలుమార్లు చూసినట్లు చెబుతున్నారు. ఆ సినిమాలో దత్తత తీసుకున్న కుమార్తెను తల్లి, కుమారుడు కలిసి హత్య చేసి, ఆమె మృతదేహాన్ని మాయం చేసేందుకు శరీర భాగాలను ఓ ట్యాంక్ లో వేసి, కెమికల్స్ వేసి కరిగించే సన్నివేశాలను ఆదర్శంగా తీసుకున్నాడని అంటున్నారు.

ఈ సమయంలో.. మాధవి మృతదేహానికి సంబంధించిన ఎముకలను కరిగించడానికి కొన్ని కెమికల్స్ వాడాడని పోలీసులు అనుమానిస్తుండగా.. అతడి చేతికి కాలిన గాయాన్ని గుర్తించారని అంటున్నారు. దీంతో.. మాధవి మిస్సింగ్ కేసును హత్యకేసుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారని తెలుస్తోంది. డీఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ అనంతరం పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఉండొచ్చని సమాచారం.