'సంక్రాంతికి వస్తున్నాం' టు 'మీర్ పేట్ మర్డర్'... ఓటీటీ అంత డేంజరా?
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన "సంక్రాంతికి వస్తున్నాం" సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 26 Jan 2025 2:30 PM GMTఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన "సంక్రాంతికి వస్తున్నాం" సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ పండక్కి ప్రేక్షకులు కుటుంబ సమేతంగా థియేటర్స్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాలు బుల్లిరాజు పాత్రధారి తన తండ్రిని సమర్థిస్తూ గోదావరి స్లాంగ్ లో చెప్పిన డైలాగులు రిపీట్ ఆడియన్స్ కి కారణం అని చెబుతున్నారు.
ఈ సమయంలో... ఏమీ అనుకోకండి.. మా వాడు ఓటీటీల్లో వెబ్ సిరీస్ లు చూసి ఇలా అయిపోయాడని చెబుతారు తండ్రి పాత్రదారి వెంకటేష్. దీనిపై బయట స్పందించిన దర్శకుడు.. ఈ రోజుల్లో ఓటీటీలు చిన్న పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని చెప్పాలనే ప్రయత్నంలో భాగమే ఆ సన్నివేశాలు తప్ప మరొకటి కాదని క్లారిటీ ఇచ్చారు.
కట్ చేస్తే... ఇటీవల మీర్ పేట్ లో భార్యను ఆమె భర్త అత్యంత కిరాతంగా హతమార్చిన ఘటన తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా తన భార్యను అడ్డు తొలగించుకోవాలని గురుమూర్తి అనే అనుమానితుడు ఆమెను చంపేశాడు. అనంతరం పోలీసులకు ఆచూకీ దొరక్కుండా ఉండటం కోసం మృతదేహాన్ని ఏమి చేయాలా అని కొన్ని గంటల పాటు ఆలోచించాడంట.
ఈ సమయంలో తన భార్య మృతదేహాన్ని బాత్ రూమ్ లోకి తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరికి, మాంసాన్ని వేరు చేసి, దాన్ని ఉడకపెట్టి, ఆ ముద్దలను ఫ్లష్ చేయగా.. ఎముకలను రోట్లో దంచి, వాటిని సమీపంలోని చెరువులో పడేసినట్లు చెప్పాడని అంటున్నారు. అతడికి ఈ ఆలోచన రావడానికి ఓటీటీలోని ఓ వెబ్ సిరీస్ సహకరించిందని చెబుతున్నారు.
దీంతో... ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీస్ లపై ఒక్కసారిగా విపరీతమైన చర్చ మొదలైందని అంటున్నారు. చిన్నపిల్లలు వాళ్ల స్థాయిలో వారూ ఈ ఓటీటీ వెబ్ సిరీస్ లకు ఎఫెక్ట్ అవుతుండగా.. మీర్ పేట్ ఘటన వంటి ఘటనల్లో క్రిమినల్ ఆలోచనలు చేస్తున్నవారికి ట్యూటోరియల్స్ గా ఈ వెబ్ సిరీస్ లు ఉపయోగపడుతున్నాయా అనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో సెన్సార్ కట్ లు లేకుండా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై క్రైమ్ సీన్ లు, బూతు డైలాగులు, శృతిమించిన శృంగార సన్నివేశాలు చూపించడం వల్ల సమాజంలో చెడు ప్రభావలకు కారణమవుతున్నాయనే చర్చ మొదలైంది. వీటిపై కంట్రోల్స్ అవసరమని నెటిజన్లు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. శృతిమించిన సిరీస్ లపై మండిపడుతున్నారు!