Begin typing your search above and press return to search.

చంద్రబాబును కలిసే ములాఖత్ మిస్ అయ్యిందెందుకు?

ఏపీ విపక్షనేత చంద్రబాబును నిబంధనలకు అనుగుణంగా కలిసేందుకు.. వారానికి రెండుసార్లు ముగ్గురు చొప్పున అనుమతించే విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 Sep 2023 5:00 AM GMT
చంద్రబాబును కలిసే ములాఖత్ మిస్ అయ్యిందెందుకు?
X

స్కిల్ స్కాం ఆరోపణలతో రాజమహేంద్రవరం జైల్లో ఉన్న ఏపీ విపక్షనేత చంద్రబాబును నిబంధనలకు అనుగుణంగా కలిసేందుకు.. వారానికి రెండుసార్లు ముగ్గురు చొప్పున అనుమతించే విషయం తెలిసిందే. మొదటి వారంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రయత్నం చేయటం.. ఆమెకు అనుమతిని నిరాకరించటం తెలిసిందే. దీనిపై విమర్శలు వెల్లువెత్తగా.. ఆ వారానికి సరిపడా ములాఖత్ కోటా పూర్తి అయిన కారణంగా ఆమెకు అనుమతి ఇవ్వలేదని జైలు అధికారులు స్పష్టం చేయటం తెలిసిందే.

నిబంధనల ప్రకారం చూస్తే.. చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు వారానికిరెండుసార్లు మాత్రమే అనుమతి ఇస్తారు. ప్రతి ములాఖత్ లోనూ ముగ్గురిని మాత్రమే అనుమతిస్తారు. గడిచిన వారంలో రెండు ములాఖత్ లకు అవకాశం ఉండగా.. ఒకటి మాత్రమే చోటుచేసుకుంది. రెండోది మిస్ అయ్యింది. ఆయనతో భేటీ కోసం తహతహలాడుతున్న వారు వందలాదిగా ఉన్నప్పటికీ.. ఒక ములాఖత్ మిస్ కావటానికి కారణం తెలిస్తే అయ్యో అనుకోకుండా ఉండలేరు.

గత వారంలో శనివారానికి ముందు ఒక ములాఖత్ అవకాశాన్ని మాత్రమే వాడుకున్నారు. శనివారం రెండో ములాఖత్ ను వినియోగించుకోవాలని భావించారు. అయితే.. సీఐడీ అధికారులు చంద్రబాబును కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు వీలుగా కోర్టు నుంచి అనుమతి తీసుకున్న నేపథ్యంలో.. శనివారం ములాఖత్ మిస్ అయ్యింది. రెండో ములాఖత్ కు శనివారం ఉంటుందని భావించినా.. సీఐడీ విచారణ నేపథ్యంలో అది సాధ్యం కాలేదు. మొత్తంగా నిబంధనలకు అనుగుణంగా రెండుసార్లు ములాఖత్ కు అవకాశం ఉన్నా.. ఒక్కసారే అనుమతి వచ్చేలా పరిణామాలు చోటు చేసుకోవటాన్ని తెలుగు తమ్ముళ్లు.. చంద్రబాబు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.