ఇది కదా మెగా పొలిటికల్ రికార్డు !
మెగా అంటేనే ఒక బిగ్ సౌండ్ వినిపిస్తుంది. మెగా స్టార్ గా దశాబ్దాలుగా సినీ సీమను ఏలుతున్న చిరంజీవి తనతో పాటు ఇతరులనూ ముందుకు తెచ్చారు.
By: Tupaki Desk | 11 Dec 2024 12:30 PM GMTమెగా అంటేనే ఒక బిగ్ సౌండ్ వినిపిస్తుంది. మెగా స్టార్ గా దశాబ్దాలుగా సినీ సీమను ఏలుతున్న చిరంజీవి తనతో పాటు ఇతరులనూ ముందుకు తెచ్చారు. అలా మెగా కాంపౌండ్ గా మారి అతి పెద్ద వట వృక్షంగా టాలీవుడ్ సీమలో వేళ్ళూనుకుంది. చిరంజీవికి జనాలలో ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. మరి కొన్నేళ్ళలో ఆయన సినీ అర్ధ శతాబ్ది ఉత్సవాలకూ రంగం సిద్ధం అవుతోంది.
ఇక చిరంజీవి అంటే కేవలం సినిమాలకే కాదు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఆయన ప్రజారాజ్యం పార్టీ 18 సీట్లూ 70 లక్షలకు పైగా ఓట్లు సాదించారు. కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయడం ద్వారా రాజ్యసభ సభ్యుడిగా ఆరేళ్ల పాటు చేశారు. మధ్యలో రెండేళ్ళ పాటు కేంద్ర మంత్రిగానూ ఇండిపెండెంట్ చార్జితో పనిచేశారు.
అలా చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం ద్వారా తగిన గుర్తింపునే దక్కించుకున్నారు అని చెప్పాలి. ఇక ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి 2024లో భారీ విజయం అందుకున్నారు. టీడీపీ బీజేపీలతో కలసి కూటమి కట్టించడంతో సక్సెస్ అయిన పవన్ కి తన కృషికి తగినట్లుగా ఉప ముఖ్యమంత్రి హోదాతో పలు కీలక శాఖలు లభించాయి.
ఇపుడు అదే కుటుంబం నుంచి ముచ్చటగా మూడవ వారుగా మెగా బ్రదర్ నాగబాబు రాష్ట్ర మంత్రి కాబోతున్నారు. ఆయన అతి తొందరలో మంచి ముహూర్తం చూసుకుని మంత్రిగా ప్రమాణం చేస్తారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే మాత్రం మెగా ఫ్యామిలీలో ముగ్గురు అన్నదమ్ములూ మంత్రి పదవులు అందుకున్న వారే అవుతారు.
ఆ విధంగా ఎవరికీ దక్కని ఒక రేర్ రికార్డుని మెగా బ్రదర్స్ క్రియేట్ చేసిన వారు అవుతారు అని అంటున్నారు. తమిళనాడులో కరుణానిధి కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు మంత్రులుగా చేశారు. కర్ణాటకలో దేవెగౌడ కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు మంత్రులుగా చేశారు. బీహార్ లో ఆర్జేడీ లో ఇద్దరు అన్నదమ్ములు మంత్రులు అయ్యారు.
కానీ ఒకే ఫ్యామిలీలో ముగ్గురు అన్నదమ్ములు మంత్రులుగా చేయడం అంటే అది ఇప్పట్లో ఎవరూ బద్ధలు కొట్టలేని రికార్డు అనే అంటున్నారు. సినీ రంగంలో మెగా ఫ్యామిలీ సాధించిన రికార్డులు అపూర్వం అనే చెప్పాలి. వాటిని బీట్ చేయడం కష్టమే అవుతోంది.
ఇపుడు రాజకీయాల్లోనూ ఈ కుటుంబం నెలకొల్పుతున్న రికార్డులు చూస్తే అందరిలోనూ ఆసక్తి కలుగుతోంది ఒకనాడు రాజకీయాల్లో మెగా ఫ్యామిలీ రాణించలేదు అన్న వారే ఇపుడు వారికి దక్కుతున్న రాజకీయ సిరిని చూసి ముక్కున వేలేసుకునే పరిస్థితి ఉంది.
అయితే ఇదంతా వారి పట్టుదల కృషి, సమయస్పూర్తితో పాటు సరైన వ్యూహాల వల్లనే సాధ్యపడింది అని అంటున్నారు. ఏది ఏమైనా ఒకే కుటుంబం అటు సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఒకే సమయంలో రాణిస్తూ అరుదైన రికార్డులను స్థాపించడం అంటే ఆ ఘనత ఒక్క మెగా ఫ్యామిలీకే దక్కుతుందేమో.
ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా వారి సొంత బేనర్ మీద ముగ్గురు మొనగాళ్ళు అని మూవీ వచ్చింది. ఇపుడు ఈ మెగా బ్రదర్స్ కి ఆ టైటిల్ యాప్ట్ అవుతుందని అభిమానులు అంటున్నారు. ముగ్గురు మినిస్టర్లు అని కూడా ఇక ముందు దానిని మార్చి అనుకోవాలేమో అని కూడా అంటున్నారు.