Begin typing your search above and press return to search.

వైరల్ మ్యాటర్ : లొకేష్ కి మెగా దీవెనలు

ఈ నేపథ్యంలో మెగాస్టార్ ఎక్స్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. దీంతో మరోసారి ఈ విషయం అతి పెద్ద వైరల్ అయిపోతోంది.

By:  Tupaki Desk   |   23 Jan 2025 12:44 PM GMT
వైరల్ మ్యాటర్ : లొకేష్ కి మెగా దీవెనలు
X

రాజకీయాలు నా ఇంట్లో ఉన్నాయి కానీ నేను వాటికి బహు దూరం అని మెగాస్టార్ చిరంజీవి పదే పదే చెబుతూ ఉంటారు. అయితే ఆయన రాజకీయాల గురించి మాట్లాడకపోయినా రాజకీయ నేతలతో టచ్ లో ఉన్నా చాలు దాని మీద ఏవేవో రాసేస్తారు. మరేవో అల్లేస్తారు. ఈ మధ్యనే ఆయన సంక్రాంతి సంబరాల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలిస్తే ఢిల్లీ వెళ్ళారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోడీతో కలసి సందడి చేశారు.

అంతే ఇంకేముంది. చిరంజీవి బీజేపీలో చేరిపోయారు అని ప్రచారం హోరెత్తింది. ఆయనకు ఉప రాష్ట్రపతి పదవి నుంచి కేంద్ర మంత్రి పదవి నుంచి గవర్నర్ పదవి దాకా చాలానే ఎవరికి తోచిన తీరున వారు ఇచ్చేసి ముచ్చట పడిపోయారు. మెగాస్టార్ రాజ్యసభ సభ్యుడు అవుతారు కేంద్ర మంత్రి అవుతారు అన్న రూమర్ ఇప్పటికీ అలాగే ఉంది.

ఈ నేపథ్యంలో మెగాస్టార్ ఎక్స్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. దీంతో మరోసారి ఈ విషయం అతి పెద్ద వైరల్ అయిపోతోంది. ఎందుకు మెగాస్టార్ పనిగట్టుకుని మరీ లోకేష్ బాబుకు గ్రీటింగ్స్ చెప్పారు అన్నదే అంతా చర్చించుకుంటున్నారు.

మెగాస్టార్ రాజకీయాలలో యాక్టివ్ గా ఉండేందుకే ఇదంతా అని రాస్తున్న వారూ ఉన్నారు. ఆయన కేంద్రంలో పెద్ద పదవిలోకి తొందరలో వెళ్తారు కాబట్టి ఏపీలో టీడీపీ కూటమితో సఖ్యతతో ఉండేందుకు ఇలా చేశారు అని ప్రచారం చేస్తున్న వారూ ఉన్నారు. ఇక ఆయన సొంత తమ్ముడు జనసేన పార్టీ కూటమిలో ముఖ్య పాత్ర పోషిస్తోంది కాబట్టి అన్నగా తన దీవెలను తమ్ముడికి మాత్రమే కాకుండా మొత్తం టీడీపీ కూటమికి అందచేసేందుకు సానుకూల వైఖరితో తాను ఉన్నట్లుగా తెలియచెప్పేందుకు కూడా ఇది ఒక సంకేతం అని అంటున్న వారూ ఉన్నారు.

మరో వైపు చూస్తే ఏపీలో డిప్యూటీ సీఎం లోకేష్ అన్న డిమాండ్ గత కొద్ది రోజుల పాటు సాగింది. దాని వల్ల జనసేన టీడీపీల మధ్య గ్యాప్ వచ్చిందని కూడా చర్చ సాగుతూ వచ్చింది. అయితే ఎలాంటి పొరపొచ్చాలు లేవు అన్నట్లుగా చెప్పేందుకు మెగా ఫ్యామిలీ అంతా కూటమికి రెండు వందల శాతం మద్దతుగా ఉందని తెలియచేన్సేందుకు కూడా ఈ విధంగా ట్వీట్ చేసి ఉంటారని అంటున్నారు.

ఏది ఏమైనా ఎన్నడూ లోకేష్ కి బర్త్ డే వేళ ట్వీట్ చేయని మెగాస్టార్ ఈసారి ప్రత్యేకంగా ట్వీట్ చేశారు అంటే అందులో చాలా విషయాలు ఉంటాయని రాజకీయ విశ్లేషణలు అయితే ఉన్నాయి. మెగాస్టార్ కూడా కూటమి మేలు కోరుకునే వారుగా అంతా చూస్తున్నారు. ఆయన అంటే కేంద్రంలోని బీజేపీ పెద్దలు విపరీతమైన ఆదరణ అభిమానం చూపుతున్న వేళ చిరంజీవి ఈ విధంగా రియాక్ట్ కావడంతో ఏ మాత్రం అతిశయోక్తి లేదని అంటున్నారు.

మెగాస్టార్ ఎపుడూ తాను అందరివాడినే అనిపించుకుంటారు అని అంటున్నారు. ఆయన గతంలో జగన్ బర్త్ డే వేళ కూడా ట్వీట్ చేసిన సంగతిని కూడా మరికొందరు గుర్తు చేస్తూ ఇందులో ప్రత్యేకత ఏమీ ఉండదని అంటున్నారు. మొత్తానికి మెగాస్టార్ మాట బాట అడుగు ఏ కదలిక అయినా అది రాజకీయ విశ్లేషణకే అవకాశం ఇస్తోంది మరి.