Begin typing your search above and press return to search.

సుడి అంటే ఇది కదా? రూ.166 లాటరీకి వచ్చినదెంతో తెలుసా?

కలిసి రావటం అంటే ఎలా ఉండాలన్న దానికి తాజా ఉదంతం ఒక చక్కటి ఉదాహరణగా చెప్పొచ్చు

By:  Tupaki Desk   |   31 Dec 2023 6:15 AM GMT
సుడి అంటే ఇది కదా? రూ.166 లాటరీకి వచ్చినదెంతో తెలుసా?
X

కలిసి రావటం అంటే ఎలా ఉండాలన్న దానికి తాజా ఉదంతం ఒక చక్కటి ఉదాహరణగా చెప్పొచ్చు. ఎప్పుడైనా కలిసి వచ్చిందంటే చాలు.. లాటరీ తగిలిందా? అని అడగటం కనిపిస్తుంది. అంచనాలకు మించి వచ్చేది ఏదైనా లాటరీ తగిలినట్లుగా ఫీల్ అవుతుంటాం. అలాంటి లాటరీ తగలటం అంటే ఎలా ఉండాలన్నది అంచనాలకు అందని రీతిలో ఉన్న ఉదంతం అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఒక వ్యక్తి అనుభవంలోకి వచ్చింది.

అతడు రూ.166 (మన రూపాయిల్లో) ఖర్చు చేసి కొన్న లాటరీకి వచ్చిన బహుమతి ఎంతో తెలుసా? మీరెంత లెక్కలు వేసుకున్నా కూడా ఆ మొత్తం తక్కువే ఉంటుంది. అంత భారీగా లాటరీ ప్రైజ్ వచ్చింది. అతగాడికి వచ్చిన బహుమతి మొత్తం అక్షరాల రూ.13,339 కోట్లు. డాలర్లలో చెప్పాలంటే 160 కోట్ల డాలర్లు.

మెగా మిలియన్ లాటరీలో భాగంగా ఈ భారీ మొత్తం అతనికి సొంతమైంది. మూడు నెలల క్రితమే ఈ విజేతను ప్రకటించారు. సెప్టెంబరు 27న విజేతను ప్రకటించినా అతడి వివరాల్ని మాత్రం చెప్పలేదు. తాజాగా ఆ పేరును ప్రకటించారు. సాల్టయిన్ హోల్డింగ్స్ పేరిట దాని యజమాని ఈ లాటరీని కొనుగోలు చేశారని.. ఈ భారీ మొత్తం అతడి సొంతమైందని చెబుతున్నారు.

మెగా మిలియన్ లాటరీ చరిత్రలో ఇదే అత్యధిక బహుమతిగా చెబుతున్నారు. లాటరీ టికెట్ అమ్మిన జాక్సన్ విల్లే ప్రాంతంలోని పబ్లిక్స్ గ్రోసరీ స్టోర్ కు రూ.83 లక్షల మొత్తం అదనపు కమీషన్ గా లభించినట్లుగా చెబుతున్నారు. లాటరీ తగలాలే కానీ.. ఇలా తగలటమా? అన్న ఆశ్చర్యానికి గురవుతున్నారు ఈ ప్రైజ్ మనీ గురించి తెలిసిన వారు.