టీడీపీ ముగ్గులోకి చిరు...?
తెలుగుదేశం పార్టీ కన్ను చిరంజీవి మీద ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో అన్నది ఉమ్మడి ఏపీ చరిత్రను చూస్తే అర్ధం అవుతుంది.
By: Tupaki Desk | 10 Aug 2023 2:30 AM GMTతెలుగుదేశం పార్టీ కన్ను చిరంజీవి మీద ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో అన్నది ఉమ్మడి ఏపీ చరిత్రను చూస్తే అర్ధం అవుతుంది. 1993లోనే చిరంజీవిని పాలిటిక్స్ లోకి నాటి టీడీపీ పెద్దలు ఆహ్వానించారు అని అప్పటి రాజకీయాల గురించి తెలిసిన వారికి అర్ధం అయ్యే విషయం. ఇక ఆ తరువాత కూడా చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం అంటే అటు కాంగ్రెస్ ఇటు టీడీపీ రెండూ కూడా తమ వైపునకు ఆయన్ని తిప్పుకునే ప్రయత్నం చేశాయి. కానీ ఆ రెండు పార్టీలకు షాక్ ఇస్తూ చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు.
ఆ ఎన్నికల్లో ఆయన ఒంటరిగా పోరాడారు. తాను అనుకున్న విధంగా జనంలోకి వెళ్ళారు. ఫలితం వేరుగా వచ్చింది. ఆ మీదట ఆయన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్ర మంత్రి అయ్యారు. 2018లో తన రాజ్యసభ సభ్యత్వం కూడా పూర్తి కావడంతో సినిమాలలోనే మునిగితేలుతున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినపుడు ఎక్కువగా టీడీపీ నుంచే ఆయన మీద విమర్శలు వచ్చాయి.
ఇక 2009లో పార్టీ ఓడిన తరువాత చిరంజీవి వల్లనే మేము ఓడామని ఆ పార్టీ అధినాయకత్వం బాహాటంగానే పలు మార్లు వ్యాఖ్యానించింది. అంత దాకా ఎందుకు ఇటీవల పాయకరావుపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ 2009, 2019లో టీడీపీ ఓడిపోవడానికి అన్నదమ్ములే కారణం అని బోల్డ్ గా స్టేట్మెంట్ ఇచ్చి రచ్చ చేశారు.
ఇక పవన్ కళ్యాణ్ జనసేన తో సఖ్యతగా ఉంటూ ఆయనతో పొత్తుల కధను నడిపించాలని టీడీపీ చూస్తోంది. అదే టైం లో అనూహ్యంగా చిరంజీవి వైసీపీ ప్రభుత్వం మీద చేసిన హాట్ కామెంట్స్ తో టీడీపీ అధినాయకత్వం ఇపుడు న్యూ టర్న్ గా తీసుకుంటోంది. ఒకే రోజు అటు ఉత్తరాంధ్రాలో చంద్రబాబు ఇటు గుంటూరులో లోకేష్ ఇద్దరూ చిరంజీవిని వెనకేసుకుని వచ్చి వైసీపీని ఘాటుగా విమర్శించారు.
చిరంజీవి అన్నది కరెక్ట్ అని వైసీపీ వారు ఆయన్ని విమర్శించడం ఏంటని నారా లోకేష్ అంటే చిరంజీవి లాంటి పెద్ద మనిషిని కూడా వదిలిపెట్టడంలేదు వైసీపీ నేతలు అని బాబు మండిపడ్డారు. ఇదే చిరంజీవి జగన్ ఇంటికి వెళ్ళి సినిమా పరిశ్రమ గురించి ఆయనతో చర్చలు జరిపితే టీడీపీలోనే కొందరు నాడు విమర్శించిన సంగతి కూడా ఈ సందర్భంగా గమనార్హం.
ఇపుడు చిరంజీవిని తమ వైపు తిప్పుకునేందుకు ముగ్గులోకి దించేందుకు టీడీపీ హై కమాండ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని అంటున్నారు. టీడీపీలోనే ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పటికే చిరంజీవికి మద్దతుగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన మెగా కాంపౌండ్ కి అత్యంత సన్నిహితులు కావడంతో టీడీపీ ఆ వైపు నుంచి మొదలెట్టి ఇపుడు టోటల్ గా బాబు చినబాబు దాకా సపొర్టు చేసేంతగా సీన్ మారింది. ఇక టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు కూడా చిరంజీవికి మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే ఇపుడు అందరికీ ఒక డౌట్ వస్తోంది. నిజానికి చిరంజీవికి రాజకీయ ఆకాంక్ష ఉందా అన్నదే ఆ డౌట్. రాజకీయ ఆకాంక్ష ఉంటే కనుక ఆయన నేరుగా తమ్ముడి పార్టీలోనే చేరి దానికే మద్దతుగా జనంలోకి వస్తారు. ఇక చిరంజీవి కనుక రంగంలోకి దిగితే డైరెక్ట్ ఫైట్ కే ఇష్టపడతారు అని అంటున్నారు. పొత్తులకు ఆయన ఒప్పుకోరు అని అంటున్న వారూ ఉన్నారు. మరో వైపు చూస్తే సినీ పెద్దగా దాసరి నారాయణరావు లాంటి వారి ప్లేస్ లో ఉన్న వ్యక్తిగా చిరంజీవి కామెంట్స్ చేశారు తప్ప ఆయన సినీ పరిశ్రమ నుంచి రాజకీయ రంగంలోకి రారని రాలేరని అంటున్న వారూ ఉన్నారు.
అయినా టీడీపీ మాత్రం ముగ్గులోకి చిరంజీవిని దించేందుకే అన్నట్లుగా భారీ ప్రకటనలు ఇస్తోంది అని అంటున్నారు. అయితే చిరంజీవి పాలిటిక్స్ లోకి రాకపోయినా ఆయన వెనక ఉన్న లక్షలాది మెగా సైన్యం మద్దతు అయినా తమకు దక్కుతుంది అన్న కొత్త వ్యూహాలతొనే టీడీపీ మెగా సపోర్ట్ ఇస్తోంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ నేతలు అతి ఉత్సాహంతో చిరంజీవి మీద చేసిన కామెంట్స్ వల్లనే అది టీడీపీకి అడ్వాంటేజ్ అవుతోందా అన్న చర్చ కూడా ఉంది అని అంటున్నారు.