మెగా యూత్ జనసేనకు జై కొట్టరా?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. కూటమి ఏర్పాటులో ప్రధాన పాత్ర జనసేనాని పవన్ కళ్యాణ్ దేనని అంటున్నారు.
By: Tupaki Desk | 22 March 2024 6:30 AM GMTఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. కూటమి ఏర్పాటులో ప్రధాన పాత్ర జనసేనాని పవన్ కళ్యాణ్ దేనని అంటున్నారు. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. ఈ రెండు స్థానాల్లోనూ ఆయన రెండో స్థానంలో నిలిచారు.
కాగా వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సూచిస్తే తాను కాకినాడ నుంచి లోక్ సభకు కూడా పోటీ చేసే అవకాశాలున్నాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అయితే తనకు అసెంబ్లీకే వెళ్లాలని ఉందన్నారు.
మరోవైపు వైసీపీ పిఠాపురంలో పవన్ ను ఓడించడానికి ‘ఆపరేషన్ పిఠాపురం’కు శ్రీకారం చుట్టిందని టాక్ నడుస్తోంది. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబు, పెండెం దొరబాబులకు ఈ మేరకు బాధ్యతలు అప్పగించిందని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
పిఠాపురంలో ఓటుకు రూ.10 వేలు, కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చి వైసీపీ తనను ఓడించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిందని.. వందల కోట్ల రూపాయలు ఇందుకు ఖర్చు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ సైతం ఆరోపించారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గెలుపును మెగా యూత్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అంటున్నారు. ఇప్పటికే నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తమ మద్దతు జనసేన పార్టీకి ఎప్పుడూ ఉంటుందని పలు ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. బాబాయ్ ఎప్పుడు తమ నుంచి ఎలాంటి సహాయం అడిగినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
పిఠాపురంలో పోరు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో మెగా యువ హీరోలంతా ప్రచారానికి వస్తారని టాక్ నడుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోపాటు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్ కూడా రావచ్చని అంటున్నారు. అవసరమైతే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం రావచ్చని పేర్కొంటున్నారు. గత ఎన్నికల్లో సైతం అల్లు అర్జున్ ఒకటి రెండు సందర్భాల్లో ప్రచారంలో పాల్గొన్నారు.
మెగా యువ హీరోలంతా పవన్ కళ్యాణ్ కు ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. అయితే చిరంజీవి మాత్రం ప్రచారానికి రారని తెలుస్తోంది. రాజకీయాలు, ఎన్నికల ప్రచారం వీటన్నింటికీ తాను దూరమని.. ప్రస్తుతం తన ఒకే ఒక వ్యాపకం సినిమాలు మాత్రమేనని ఆయన చెప్పినట్టు సమాచారం.
అయితే చిరంజీవి కూడా పలు ఇంటర్వ్యూల్లో తన మద్దతును పవన్ కళ్యాణ్ కు ప్రకటించారు. తన తమ్ముడు రాజకీయాలకు సరిపోతాడని, ఒక మాట ప్రత్యర్థి పార్టీలతో అనిపించుకోగలడని.. తిరిగి అనగలిగే సత్తా కూడా తనకు ఉందని చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు. తన తమ్ముడిని ఉన్నత స్థానంలో చూడాలనుకుంటున్నానని.. అందుకు సరిపోయే వ్యక్తిత్వం తన తమ్ముడికి ఉందని తేల్చిచెప్పారు. తాను మరే పార్టీలో లేకుండా ఉండటమే తన తమ్ముడికి తాను చేయగలిగే మేలు అని చిరంజీవి వెల్లడించారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున మెగా యువ హీరోలంతా ప్రచారానికి రావడం ఖాయమేనంటున్నారు. తెర వెనుక నుంచి చిరంజీవి ఆశీస్సులు ఎలాగూ ఉంటాయంటున్నారు.
ఇక టీడీపీ తరపున సైతం ప్రముఖ నటుడు బాలకృష్ణతోపాటు, చంద్రబాబు సోదరుడి కుమారుడు నారా రోహిత్, నందమూరి చైతన్య కృష్ణ తదితరులు ప్రచారంలో పాలుపంచుకుంటారని చెబుతున్నారు. ఇక అన్నదమ్ములు నందమూరి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తారనేదే తేలడం లేదు.