Begin typing your search above and press return to search.

పిల్లికి ఎలుక శాపం.. భారత్ పై కెనడా ఆంక్షలు..

అయినదానికి కానిదానికి భారత్ పై కయ్యం పెట్టుకుంటున్న కెనడా.. మరో చర్య తీసుకునే ఆలోచనలో ఉందా..?

By:  Tupaki Desk   |   15 Oct 2024 9:37 AM GMT
పిల్లికి ఎలుక శాపం.. భారత్ పై కెనడా ఆంక్షలు..
X

అయినదానికి కానిదానికి భారత్ పై కయ్యం పెట్టుకుంటున్న కెనడా.. మరో చర్య తీసుకునే ఆలోచనలో ఉందా..? ఇప్పటికే దౌత్య సంబంధాలు ఎన్నడూ లేని స్థాయిలో తీవ్రంగా దిగజారగా.. ఇకపై వ్యాపార సంబంధాలూ పతనం కానున్నాయా..? ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ను వెనకేసుకు వస్తూ.. భారత్ వంటి బలమైన దేశంతో స్నేహం చెడగొట్టుకుంటుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. వీటికి సమాధానాలు కూడా ఔననే అనిపిస్తోంది.

అమెరికాకే తలొగ్గలేదు..

1998లో ప్రోఖ్రాన్ లో అణు పరీక్షల అనంతరం అప్పటి వాజ్ పేయీ ప్రభుత్వంపై అమెరికా కన్నెర్ర చేసింది. సాఫ్ట్ వేర్ రంగంలో భారత్ బలమైన శక్తిగా ఎదగని ఆ కాలంలోనే మన మీద ఆంక్షలు విధించింది. కానీ, దీనిని భారత్ తట్టుకుంది. మిత్ర దేశాల సహకారంతో మరింత బలోపేతం అయింది. చివరకు గతి లేక అమెరికానే భారత్ పై ఆంక్షలను ఎత్తివేసింది. అయితే, ఇప్పుడు నిజ్జర్ హత్య కేసును సాకుగా చూపి భారత్ ను అవమానిస్తున్న కెనడా ఏకంగా ఆంక్షలకు సిద్ధమవుతోందట.కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ వ్యాఖ్యలను చూస్తే ఇదే అర్థం వస్తోంది. ‘‘మేం నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం’’ అంటూ అమె రెచ్చగొట్టేలా స్పందించారు.

ఒక వ్యక్తి కోసం దేశాన్నే వదులుకుంటుందా?

నిజ్జర్ ఓ సామన్య వ్యక్తి. అతడి హత్య జరిగి ఏడాదిన్నర దాటింది. అలాంటి వాడి కోసం భారత్ వంటి బలమైన దేశంతో సంబంధాలు చెడగొట్టుకుంటోంది కెనడా. నిజ్జర్‌ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మను చేర్చడమే దీనికి నిదర్శనం. నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో భారత్‌ సహకరించడం లేదని సాక్షాత్తు కెనడా ప్రధాని ట్రూడోనే ఆరోపించారు. దౌత్యవేత్తల వివాదంతో ఆగక.. తాజాగా గ్యాంగ్ స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ పేరునూ ప్రస్తావనకు తెచ్చింది. బిష్ణోయ్ గ్యాంగ్‌ తో కలిసి భారత ఏజెంట్లు.. తమ దేశంలోని ఖలీస్థానీలను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించింది. తాజాగా ఆ దేశ విదేశాంగ మంత్రి ఏకంగా ఆంక్షల ప్రస్తావననే తెచ్చారు. విదేశాంగ మంత్రి స్థాయి వ్యక్తే ఇలా మాట్లాడడంతో చర్చనీయాంశమైంది. దీనికితోడు కెనడాలో సిక్కుల భద్రతపై ఆ దేశ న్యూ డెమోక్రాటిక్ పార్టీ (ఎన్డీపీ) నాయకుడు జగ్మీత్ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేస్తూనే.. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భారత్‌ పై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత దౌత్యవేత్తల బహిష్కరణనూ ఆయన సమర్థించారు. భారత్ పై దౌత్య ఆంక్షలు విధించాలని కూడా పిలుపునిచ్చారు. కెనడాలో ఆర్‌ఎస్‌ఎస్‌ నెట్‌ వర్క్‌ ఉందని.. దానిపై నిషేధం విధించాలన్నారు. కెనడా గడ్డపై వ్యవస్థీకృత నేరాల్లో భాగమైనవారిపై కఠిన చర్యలు ఉండాలంటూ భారత్ గురించి పరోక్షంగా తప్పుబట్టారు. విషయం ఏమంటే.. ఎన్‌డీపీ గతంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కు చెందిన లిబరల్‌ పార్టీ ఆఫ్ కెనడాకు మిత్రపక్షం.