Begin typing your search above and press return to search.

మహిళల హక్కుల కోసం నిలబడ్డ మహిళ... రూ.8,321 కోట్ల విరాళం!

ఈ క్రమంలోనే తాజాగా మహిళల హక్కుల కోసం బలంగా నిలబడ్డారు ఓ మహిళ.

By:  Tupaki Desk   |   29 May 2024 12:59 PM GMT
మహిళల హక్కుల కోసం నిలబడ్డ మహిళ...  రూ.8,321 కోట్ల విరాళం!
X

స్త్రీకి స్త్రీయే శత్రువు అని అంటుంటారు..! అయితే అది అన్ని సందర్భాల్లోనూ నిజమైన పాయింట్ కాదు! చాలా సందర్భాల్లో స్త్రీ కోసం మరో స్త్రీయే నిలబడుతుంది.. పోరాడుతుంది. ఈ క్రమంలోనే తాజాగా మహిళల హక్కుల కోసం బలంగా నిలబడ్డారు ఓ మహిళ. అందుకోసం సుమారు రూ.8,321 కోట్ల విరాళం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది.

అవును... మహిళల హక్కుల కోసం వచ్చే 2 సంవత్సరాల్లో బిలియన్ డాలర్లు (రూ.8,321 కోట్లు) విరాళం ఇవ్వనున్నారు మెలిండా ఫ్రెంచ్ గేట్స్. ఈ నెల ప్రారంభంలో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ నుండి ఫ్రెంచ్ గేట్స్ వైదొలుగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం... మహిళలు, కుటుంబాలపై తాను దృష్టి పెడతానని ఆమె ప్రతిజ్ఞ చేశారు.

ఈ సమయంలో గేట్స్ ఫౌండేషన్ నుండి నిష్క్రమించడంతో ఫ్రెంచ్ గేట్స్ తన దాతృత్వానికి బిల్ గేట్స్ నుండి 12 బిలియన్ డాలర్లు అందుకున్నారు! ఈ క్రమంలోనే యునైటెడ్ స్టేట్స్‌ లో మహిళల హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలు, వ్యక్తులకు వచ్చే రెండేళ్లలో బిలియన్ డాలర్లు విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు.

యుఎస్‌ లో లింగ సమానత్వానికి అతిపెద్ద దాతృత్వ మద్దతుదారులలో ఒకరైన ఫ్రెంచ్ గేట్స్... న్యూయార్క్ టైమ్స్‌ కు రాసిన గెస్ట్ కాలమ్ లో... లింగ సమానత్వం గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదని చెప్పే వ్యక్తుల వల్ల సంవత్సరాలుగా విసుగు చెందినట్లు పేర్కొన్నారు.

ఇదే సమయంలో... మహిళలు, బాలికలపై పెట్టుబడి పెట్టడం ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూరుస్తుందని దశాబ్దాల పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయని ఆమె అన్నారు. ఈ క్రమంలోనే 2026 చివరిలోగా 12 మంది వ్యక్తులకు ఒక్కొక్కరికి $20 మిలియన్లు అందజేస్తామని ఫ్రెంచ్ గేట్స్ హామీ ఇచ్చారు. ఆ నిధులు నేషనల్ ఫిలాంత్రోపిక్ ట్రస్ట్ ద్వారా నిర్వహించబడతాయని తెలిపారు.

మొత్తంగా.. ఫ్రెంచ్ గేట్స్ వాగ్దానం చేసిన ఒక బిలియన్‌ డాలర్లలో 690 మిలియన్ల డాలర్లకు సరిపడా కమిట్మెంట్‌ లను ప్రకటించారు. అదేవిధంగా... ప్రపంచవ్యాప్తంగా మహిళల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్న సంస్థలకు 250 మిలియన్ డాలర్లు అందజేయనున్నట్లు ఫ్రెంచ్ గేట్స్ వెల్లడించారు.