ఆత్మహత్యలలో మగాళ్ళదే ఎక్కువ వాటా
పాపం మగాడు అని మరోసారి అనుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే మగవారికి మానసిక బలం తక్కువ అని అంటారు.
By: Tupaki Desk | 4 Feb 2025 3:47 AM GMTపాపం మగాడు అని మరోసారి అనుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే మగవారికి మానసిక బలం తక్కువ అని అంటారు. సైకాలజిస్టులు ఇదే మాట చెబుతారు. అదే నిజం అనేలా దేశంలోని గణాంకాలు ఉన్నాయి. దేశంలో ఆత్మహత్యలు చేసుకున్న వారిలో మహిళలతో పోలిస్తే మగాళ్ళే అత్యధిక శాతం ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.
జాతీయ క్రైమ్ రికార్డు బ్యూరో ఇచ్చిన గణాంకాల ప్రకారం 2022లో భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 72 శాతం అంటే ఒక లక్ష ఇరవై అయిదు వేల మంది పురుషులు ఉంటే మహిళలు దాదాపుగా 47 వేల మంది దాకా ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఈ నంబర్ చూస్తే కనుక 2014 నుంచి 2021 మధ్యలో కంటే కూడా ఆత్మహత్యలలో పురుషుల మహిళల మధ్య నిష్పత్తిలో భారీ తేడా కనిపిస్తోంది అని గణాంకాలు తెలిపాయి. ఈ పెరుగుదలలో ఎక్కువ శాతం అంటే 107.5 శాతం పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నది కేవలం కుటుంబ సమస్యల కారణంగానే అని ఆ గణాంకాలు తెలియచేస్తున్నాయి.
ఈ ఆత్మహత్యల మీద అందులోనూ పురుషులు అధిక శాతం బలి కావడం మీద బీజేపీకి చెందిన ఎంపీ దినేష్ శర్మ రాజ్యసభలో జీరో అవర్ లో ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ దేశంలో గృహ హింస, మహిళల మీద దోపిడి వంటి చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
బెంగళూరుకు చెందిన టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్యను ఆయన ప్రస్తావించారు. తప్పుడు ఆరోపణలతో చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఒక ప్రమాదకరమైన ధోరణిగా మారిందని ఆయన అన్నారు. ఇలాంటి చట్టాల విషయంలో తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న మగవాళ్ళకు చట్టబద్ధమైన రక్షణతో పాటు భావోద్వేగమైన మద్దతుని కూడా అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతే కాదు చట్టాలను అడ్డం పెట్టుకుని తప్పుడు ఆరోపణలు చేసేవారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
అంతే కాకుండా గృహ హింస, వేధింపులకు సంబంధించిన చట్టాలను లింగ బేధం లేకుండా తటస్థం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గృహ హింస మహిళల మీద దోపిడీకి సంబంధించిన చట్టాల వల్ల మహిళలకు ఎంతో రక్షణ లభిస్తోందని అదే సమయంలో హింస దోపిడీల నుంచి పురుషులకు మాత్రం చట్టపరమైన రక్షణ లేకపోవడం బాధాకరమని దినేష్ శర్మ అన్నారు.
ఇదిలా ఉంటే దేశంలో చాలా తప్పుడు కేసుల కారణంగా గృహ హింస వేధింపుల వంటి చట్టాలను ఆసరగా చేసుకుని పురుషుల మీద జరుగుతున్న దాడులతోనే ఆత్మహత్యలు పెరుగుతున్నాయని సామాజిక నిపుణులు కూడా చెబుతున్నారు. ప్రాణం ఎవరికైనా ప్రాణమే. అలాగే రక్షణ అందరికీ కల్పించాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ విషయమో పురోగమిస్తున్న సమాజం, దానితో పాటు మారుతున్న అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని చట్టాలలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.