బిర్యానీలో ఎక్స్ ట్రా రైతా అడిగాడు.. దాడి చేసి ప్రాణాలు తీశారు
దాడిలో మరణించిన లియాఖత్ కు భార్య.. నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ ఉదంతంలో పంజాగుట్ట పోలీసుల తీరును పలువురు తప్పు పడుతున్నారు
By: Tupaki Desk | 12 Sep 2023 4:46 AM GMTహైదరాబాద్ లోని ఒక హోటల్ సిబ్బంది వ్యవహరించిన తీరు ఆరాచకాన్ని తలపించింది. హోటల్ కు వచ్చిన కస్టమర్ బిర్యానీ తింటూ అదనంగా రైతా (పెరుగు చట్నీ)ను అడటం.. దీనికి నో చెప్పిన హోటల్ సిబ్బంది కస్టమర్ తో వాగ్వాదానికి దిగటం.. అతడిపై మూకుమ్మడిగా దాడికి దిగిన ఉదంతంలో సదరు కస్టమర్ మృతి చెందిన షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. గోల్కొండ ప్రాంతానికి చెందిన సలీంఖాన్ అతని తొమ్మిది మంది స్నేహితులు కలిసి ఆదివారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో పంజాగుట్టలోని మెరిడియన్ హోటల్ కు వెళ్లారు. రెండు బిర్యానీలు ఆర్డర్ చేశారు.
బిర్యానీ తింటూ అదనంగా రైతా కావాలని అడిగారు. ఇందుకోసం వెయిటర్ కు పలుమార్లు చెప్పారు. అయినప్పటికీ వెయిటర్ ఇవ్వకపోవటంతో గట్టిగా అడిగారు. ఈ సందర్భంగా సలీంఖాన్ స్నేహితుల్లో ఒకరైన మహమ్మద్ లియాఖత్ లేచి సిబ్బందిని గట్టిగా ప్రశ్నించటంతో వాగ్వాదం మొదలైంది. ఈ సందర్భంగా సిబ్బంది మొత్తం అతన్ని చితకబాదారు. ఈ గొడవ గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని అందరిని బయటకు తీసుకొచ్చారు. ఈ సమయంలో మరోసారి హోటల్ సిబ్బంది దాడి చేశారు.
ఇరు పక్షాల వారిని పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. సిబ్బంది చేతుల్లో దెబ్బలు తిన్న లియాఖత్ తనకు ఆయాసం వస్తుందని.. ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరాడు. అయితే.. బాధితుడు అడిగిన వెంటనే కాకుండా ఆలస్యంగా అతడ్ని ఆసుపత్రికి తరలించటంతో అతను మరణించినట్లుగా బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరును తప్పు పడుతున్నారు. నిందితుల్లో బిహార్ కు చెందిన వెయిటర్ ప్రకాష్.. బాపూనగర్ కు చెందిన మెగావత్ పాండు.. చార్మినార్ కు చెందిన మేనేజర్ సయ్యద్ ఆఫ్తాబ్.. జగద్గిరిగుట్టకు చెందిన అబ్దుల్ మొయిన్.. సనత్ నగర్ కు చెందిన సూపర్ వైజర్ అజీజుద్దీన్ తో సహా మరికొందరు ఉన్నట్లుగా చెబుతున్నారు.
దాడిలో మరణించిన లియాఖత్ కు భార్య.. నలుగురు పిల్లలు ఉన్నారు. ఈ ఉదంతంలో పంజాగుట్ట పోలీసుల తీరును పలువురు తప్పు పడుతున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగానే లియాఖత్ మరణించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీరియస్ అయ్యారు. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాల్ని పరిశీలించిన ఆయన.. ఎస్ఐ శివశంకర్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ రమేశ్ లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.