మేం హ్యాపీ.. జగన్ కోసం పనిచేస్తాం: మంత్రి సంచలన వ్యాఖ్యలు
సీఎం జగన్ కోసం పనిచేస్తాం. ఆయనను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుతాం" అని వైసీపీ ముఖ్యనాయకుడు, మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 13 Dec 2023 2:52 PM GMT"మేం హ్యాపీగా ఉన్నాం. మేమే కాదు.. మా ఎమ్మెల్యేలు కూడా అందరూ సంతోషంగాఉన్నారు. ఎక్కడా మాకు అసంతృప్తి లేదు. ఏదైనా అసంతృప్తి ఉంటే.. అది ప్రతిపక్షాలకు, ఓ వర్గం మీడియాకు మాత్రమే ఉండి ఉంటుంది. వారి ఎత్తులు పారడం లేదు. అందుకే వారు మాపై విపరీత ప్రచారం చేస్తున్నారు. మేమంతా ఓ జట్లు. సీఎం జగన్ కోసం పనిచేస్తాం. ఆయనను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుతాం" అని వైసీపీ ముఖ్యనాయకుడు, మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు.
తాజాగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. గుంటూరు రాజకీయాలపై తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. గుంటూరు రాజకీయాల్లో వైసీపీ ప్రభంజనం మరోసారి కనిపిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మరిన్ని సీట్లు గెలుస్తుందన్నారు. శ్రీవారి ఆశీస్సులతో జగన్ మళ్లీ సీఎం అవుతారన్నారు. వ్యక్తిగత కారణాల నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేసినా.. ఆయన ఇప్పటికి తమ పార్టీ నాయకుడేనని చెప్పారు.
ఎమ్మెల్యేలు ఎవరికీ అసంతృప్తి లేదని మేరుగ పదే పదే చెప్పారు. అందరం జగన్ కోసం పని చేస్తామన్నారు. నియోజకవర్గం మార్పుపై తనకు కూడా ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. వేమూరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు పోటీ చేశానని, జగన్ బొమ్మతోనే గత ఎన్నికల్లో గెలిచానని మేరుగ వ్యాఖ్యానించారు. జగన్ ఆశీస్సులతోనే మంత్రిని అయ్యానని నాగార్జున తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సంతనూతలపాడు నియోజకవర్గానికి ఇన్చార్జిగా నియమించారని, జగన్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటి చేసి, గెలిచి ఆయనకు గిఫ్ట్‌గా ఇస్తానన్నారు.