'మెటా'లో సంచలనం.. డేటా లీక్!!
ఈ విషయం తెలిసిన వెంటనే.. మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 28 Feb 2025 7:30 PM GMTఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో దూసుకుపోతున్న మెటాలో సంచలనం చోటు చేసుకుంది. కీలకమైన అంతర్గత డేటా మీడియాకు లీకైంది. దీంతో ఇక్కసారిగా సంస్థలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. ఈ డేటాలో అత్యంత రహస్యమైన సమాచారం కూడా ఉందని సందేహిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే.. మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా సమాచారాన్ని మీడియాకు లీక్ చేసిన ఉద్యోగులను గుర్తించే పనిలో పడ్డారు.
ఈ క్రమంలో ఇప్పటికే 20 మందికిపైగా ఉద్యోగాల నుంచి తక్షణం తొలగించినట్టు జుకర్ బర్గ్ ప్రకటిం చారు. అయితే.. డేటా లీక్ అనేది ఇప్పటికిప్పుడు కాలేదని.. గత కొన్నాళ్లుగా అత్యంత రహస్యంగా దీనిని బహిరంగ పరుస్తున్నట్టు జుకర్ బర్గ్ భావిస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌తో విభేదించిన బర్గ్ అప్పటి అధ్యక్షుడు బైడెన్‌కు మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి తన సంస్థకు చెందిన రహస్య సమాచారాన్ని ఉద్యోగులే బయటకు వెల్లడిస్తున్నట్టు అనుమానించారు.
దీంతో తాజాగా విచారణ చేపట్టి జుకర్ బర్గ్.. ప్రస్తుతం 20కి పైగా ఉద్యోగులను వెనువెంటనే తీసేశారు. ఇంకా ఎవరైనా ఉంటే.. వారిపైనా వేటు వేయనున్నట్టు బర్గ్ ప్రకటించారు. ``కంపెనీ పాలసీకి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇకపై లీక్‌లు జరిగితే మరింత కఠిన చర్యలు తప్పవు`` అని ఉద్యోగుల పర్సనల్ చాట్‌లో సంస్థ స్పష్టం చేయడం గమనార్హం. అంతేకాదు.. సంస్థ రహస్యాలను, రహస్య సమాచారాన్ని బయటకు లీక్ చేయడం, వేరే వ్యక్తులతో పంచుకోవడం.. తమ కంపెనీ విధానాలకు విరుద్దమని పేర్కొంది.
విషయం ఏంటి?
మెటా సంస్థ.. అనేక దేశాలకు సేవలు అందిస్తోంది. ఈ క్రమంలో పలు దేశాలతో చేసుకున్న ఒప్పందాలు .. పలు కంపెనీలకు అందిస్తున్న సేవల విషయంలో గోప్యత పాటిస్తుంది. ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా మెటాపై విమర్శలురావడంపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే రహస్య సమాచారం బయటకు పొక్కినట్టు గుర్తించారు. అయితే ఏ రహస్య సమాచారం బయటకు పొక్కిందన్న విషయాన్ని గోప్యంగా ఉంచారు.