Begin typing your search above and press return to search.

5 ఖండాలు.. 50 వేల కిమీ.. సముద్ర గర్భంలో మెటా బిగ్ ప్లాన్ ఇదే!

భారతదేశాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాలతో కలుపుతూ ఐదు ఖండాలలో విస్తరిస్తూ 50,000 కిలో మీటర్ల సముద్రగర్భ కేబుల్ ను నిర్మించనుంది మెటా.

By:  Tupaki Desk   |   15 Feb 2025 4:30 PM GMT
5 ఖండాలు.. 50 వేల కిమీ.. సముద్ర గర్భంలో మెటా బిగ్ ప్లాన్  ఇదే!
X

సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లను నిర్వహిస్తోన్న మెటా సంస్థ ప్రపంచంలోనే అతిపొడవైన సముద్రగర్భ కేబుల్ వేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇక్కడ అత్యంత ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ ప్రాజెక్టులో భారతదేశం కూడా ఓ కీలక పాత్ర పోషించబోతోంది. ఈ మేరకు మెటా కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది.

అవును... భారతదేశాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాలతో కలుపుతూ ఐదు ఖండాలలో విస్తరిస్తూ 50,000 కిలో మీటర్ల సముద్రగర్భ కేబుల్ ను నిర్మించనుంది మెటా. ఈ మేరకు ఈ రెండు దేశాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఈ ప్రాజెక్టులో మెటా.. మల్టీ బిలియన్ - మల్టీ ఇయర్ ఇన్వెస్ట్ మెంట్ పెడుతుందని.. ఈ ఏడాదే పనిని ప్రారంభిస్తుందని చెబుతున్నారు.

ఈ సమయంలో.. హిందూ మహాసముద్రంలో సముద్రగర్భ కేబుల్ ల నిర్వహణ, మరమ్మత్తు, ఫైనాన్సింగ్ లో పెట్టుబడి పెట్టాలని భారత్ భావిస్తోందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ సముద్ర ఉపరితలానికి 7,000 మీటర్లు (22,966 అడుగులు) కంటే లోతున ఉండనుందని చెబుతున్నరు. ఇది అమెరికా, బ్రెజిల్, సౌతాఫ్రికా, భారత్, ఆస్ట్రేలియాలను కలుపుతుంది.

ఈ నేపథ్యంలో... భారత్ లో ల్యాండింగ్ స్టేషన్ కలిగి ఉన్న 18వ ప్రాజెక్ట్ గా ఇది ఉంటుందని చెబుతున్నారు. ట్రాయ్ డేటా ప్రకారం ఇప్పటివరకూ భారత్ 17 ఇంటర్నేషనల్ సబ్ సీ కేబుల్ లను కలిగి ఉంది.

ఇదే సమయంలో.. రెండు కొత్త కేబుల్ వ్యవస్థలు.. ఇండియా ఆసియా ఎక్స్ ప్రెస్ (ఐఏఎక్స్), ఇండియా యూరప్ ఎక్స్ ప్రెస్ (ఐఈఎక్స్) సమిష్టిగా 15,000 కిలోమీటర్లకు పైగా పొడవున్న వ్యవస్థ రిలయన్స్ జియో యాజమాన్యం సారథ్యంలో 2025 చివరి నాటికి లైవ్ కానున్నాయని అంటున్నారు.

నివేదికల ప్రకారం.. ఐఏఎక్స్ కేబుల్ వ్యవస్థ భారత్ లోని రెండు ప్రధాన ల్యాండింగ్ స్టేషన్స్ అయిన చెన్నై, ముంబై లను సింగపూర్, థాయిలాండ్, మలేషియాకు అనుసంధానించగలదని చెబుతుండగా.. ఐఏఎక్స్ వ్యవస్థ.. ఫ్రాన్స్, గ్రీస్, సౌదీ అరేబియాలను, పశ్చిమాసియా, తూర్పు ఆఫ్రికాలోని కొన్ని దేశాలకు అనుసంధానించే అవకాశం ఉందని అంటున్నారు.