Begin typing your search above and press return to search.

కోకాపేటకు మెట్రో.. బడ్జెట్ కేటాయింపుల వేళ బయటకు

తాజాగా బడ్జెట్ పద్దుల్లో పేర్కొన్న మార్పులపై మరింత లోతుల్లోకి వెళితే కొత్త విషయం బయటకు వచ్చింది.

By:  Tupaki Desk   |   26 July 2024 5:30 AM GMT
కోకాపేటకు మెట్రో.. బడ్జెట్ కేటాయింపుల వేళ బయటకు
X

ఇప్పటివరకు రాయదుర్గం వరకు ఉన్న మెట్రో స్టేషన్.. ప్రతిపాదిత డిజైన్ ప్రకారం నానక్ రాంగూడ విప్రో సర్కిల్ వరకు వస్తుందన్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ప్రవేశ పెట్టిన తెలంగాణ పూర్తిస్థాయి బడ్జెట్ పుణ్యమాఅని మరో ఆసక్తికర అంశం వెలుగు చూసింది. తాజాగా బడ్జెట్ పద్దుల్లో పేర్కొన్న మార్పులపై మరింత లోతుల్లోకి వెళితే కొత్త విషయం బయటకు వచ్చింది.

రెండో దశలో దూరం పెరగటమే కాదు.. అంచనా వ్యయంలోనూ మార్పు కనిపించింది. 5 కారిడార్లలో 70కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా.. తాజాగా అది 78.4 కిలోమీటర్లకు పెరిగింది. మరి.. పెరిగిన 8.4 కిలోమీటర్ల దూరం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నప్పుడు.. కీలకమైన ఐటీ కారిడార్ లో మరో ఎనిమిదిన్నర కిలోమీటర్ల దూరానికి మెట్రో విస్తరించేలా మార్పులు చేశారన్న విషయం బయటకు వచ్చింది. దీంతో అంచనా వ్యయం రూ.24,042 కోట్లుకు చేరుకుంది.

రాయదుర్గంనుంచి విప్రో కూడలి.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని యూఎస్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటరల మార్గాన్ని తొలుత ప్రతిపాదించటం తెలిసిందే. అయితే.. దీన్ని కోకాపేటలోని నియోపోలీస్ వరకు విస్తరించాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. దీంతో ఇక్కడ దూరం పెరిగింది. అంతేకాదు.. ఇక్కడే మెట్రో డిపోను కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. కోకాపేటలో ఏర్పాటు చేసే మెట్రో డిపో తో ఇది మూడోది అవుతుంది. ఇప్పటివరకు మియాపూర్.. ఉప్పల్ నాగోల్ స్టేషన్ వద్ద డిపోలు ఉన్నాయి. మూడోది కోకాపేట నియోపోలీస్ వద్ద ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే వేగంగా విస్తరిస్తున్న ఐటీ కారిడార్..తాజా ప్రతిపాదన నేపథ్యంలో మరింతగా దూసుకెళ్లటం ఖాయమని చెప్పక తప్పదు.