Begin typing your search above and press return to search.

భారత్‌ - కెనడా ఉద్రిక్తతలు.. 'పెద్దన్న' ఎటువైపు!

ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ సంస్థ.. పెంటగాన్‌ మాజీ అధికారి మైఖెల్‌ రూబిన్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

By:  Tupaki Desk   |   23 Sep 2023 10:51 AM GMT
భారత్‌ - కెనడా ఉద్రిక్తతలు.. పెద్దన్న ఎటువైపు!
X

తమ దేశ పౌరుడు, ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ను భారత ప్రభుత్వ ఏజెంట్లు చంపారంటూ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన తీవ్ర ఆరోపణలు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కెనడా ప్రధాని ట్రూడో.. ఆ దేశంలో భారత దౌత్యవేత్తను దేశం నుంచి బహిష్కరించారు. దీనికి దీటుగా ప్రతిస్పందించిన భారత్‌.. మనదేశంలోని కెనడా దౌత్యవేత్తను కూడా దేశం నుంచి బహిష్కరించింది. అంతేకాకుండా కెనడియన్లకు వీసాల జారీని నిలిపేసింది.

అయినా జస్టిన్‌ ట్రూడో వెనక్కి తగ్గడం లేదు. భారత్‌ పైన హత్య ఆరోపణలను చేస్తూనే ఉన్నారు. తాము చేసే దర్యాప్తులో భారత్‌ కూడా పాలుపంచుకోవాలని.. తమ దర్యాప్తుకు సహకరించాలని ట్రూడో కోరుతున్నారు. అంతేకాకుండా కెనడా మిత్ర దేశాలైన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాల అధినేతలు, ప్రధానులకు కూడా భారత్‌ పైన ఆయన ఫిర్యాదులు చేశారు. ఈ విషయంలో భారత్‌ పై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు.

మొదట్లో ఈ అంశంపై పెద్దగా స్పందించని ప్రపంచ పెద్దన్న.. అమెరికా ప్రస్తుతం తన గొంతును సవరించుకుంటోంది. కెనడా దర్యాప్తునకు భారత్‌ సహకరించాలని కోరుతోంది. కెనడా చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని.. ఇలాంటి వాటి విషయంలో ఏ దేశానికి మినహాయింపులు ఉండవని ఇప్పటికే చెప్పింది. భారత్‌ కు కూడా ఇలాంటి విషయాల్లో మినహాయింపులు ఉండవని.. కెనడా చెప్పినట్టు భారత్‌ చేయాలని అమెరికా కోరుతుండటం గమనార్హం.

ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ సంస్థ.. పెంటగాన్‌ మాజీ అధికారి మైఖెల్‌ రూబిన్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. రెండు మిత్రదేశాల విషయంలో అమెరికా ఒకరికి మద్దతుగా నిలుస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. ఒకవేళ అలా ఎంచుకోవాల్సి వస్తే.. ప్రస్తుత వ్యవహారంలో అమెరికా మొగ్గు భారత్‌ వైపే ఉంటుందని తెలిపారు. ఎందుకంటే నిజ్జర్‌ ఒక ఉగ్రవాది అని రూబిన్‌ గుర్తు చేశారు. అమెరికాకు భారత్‌ చాలా ముఖ్యమైందని చెప్పారు.

కెనడా ప్రధాని హోదాలో జస్టిన్‌ ట్రూడో ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని పెంటగాన్‌ మాజీ అధికారి మైఖేల్‌ రూబిన్‌ వెల్లడించారు. ట్రూడో పదవీ కాలం ముగిసిపోయాక కెనడాతో తమ బంధాన్ని మళ్లీ పునర్నిర్మించుకుంటామని ఆయన హాట్‌ కామెంట్స్‌ చేశారు.

ఈ ఘర్షణ భారత్‌ కంటే కెనడాకే ఎక్కువ ప్రమాదమని మైఖేల్‌ రూబిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఘర్షణే కావాలనుకుంటే.. అది ఏనుగుతో చీమ పోరాటం లాగే ఉంటుందని చెప్పారు. భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమనేది గుర్తించాల్సి ఉంటుందన్నారు. చైనాను ఎదుర్కొనే విషయంలో వ్యూహాత్మకంగా భారత్‌ తో తమ బంధం చాలా ముఖ్యమైంది అని వ్యాఖ్యానించారు.

అలాగే ట్రాన్స్‌నేషనల్‌ రిప్రెషన్‌ (సీమాంతర అణచివేత) అంటూ అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ చేసిన వ్యాఖ్యలను మైఖేల్‌ రూబిన్‌ తప్పుబట్టారు. మనల్ని మనం మోసం చేసుకోకూడదన్నారు. హరదీప్‌ సింగ్‌ నిజ్జర్‌ కెనడా చెప్పినట్టు ప్లంబర్‌ కాదని అతడో ఉగ్రవాది అని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఒసామా బిన్‌ లాడెన్‌ ను ఎలాగయితే ఇంజనీర్‌ గా గుర్తించమో.. అతడిని ఎన్నో దాడులు చేసిన ఉగ్రవాదిగా గుర్తిస్తామో అలాగే నిజ్జర్‌ కూడా అలాంటి వాడేనన్నారు. ఎన్నో దాడులు చేసి నిజ్జర్‌ చేతులు రక్తంతో తడిసిపోయాయన్నారు.

మనం మాట్లాడుతున్నది సీమాంతర అణిచివేత గురించి కాదు.. సీమాంతర ఉగ్రవాదం గురించి అని మైఖేల్‌ రూబిన్‌.. తమ విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ కు గుర్తు చేశారు. తమ దేశానికి హాని కలిగించిన ఉగ్రవాది ఒసామా బిన్‌ లాడెన్‌ ని అమెరికా దళాలు పాకిస్థాన్‌ లోకి ప్రవేశించి హతమార్చాయని ఈ సందర్భంగా బ్లింకెన్‌ కు మైఖేల్‌ గుర్తుచేశారు.