ఫ్రాన్స్ లో రాజకీయ సంక్షోభం.. 3 నెలలకే ప్రధాని పదవి ఊడింది!
మూడు నెలల క్రితం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మైకేల్ బార్నియర్ తన పదవికి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది.
By: Tupaki Desk | 6 Dec 2024 8:30 AM GMTసంపన్న దేశాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పే ఫ్రాన్స్ లో రాజకీయ సంక్షోభం చోటు చేసుకుంది. మూడు నెలల క్రితం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మైకేల్ బార్నియర్ తన పదవికి రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది. దీనికి కారణంగా ఆయన ప్రభుత్వంపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ప్రధానమంత్రిగా బార్నియర్ పదవి కోల్పోవటానికి విపక్ష సభ్యులే కాదు సొంత పార్టీ నేతలు కూడా కారణమే. అవిశ్వాస తీర్మానంలో అధికారపక్ష సభ్యులు సైతం ప్రధానికి వ్యతిరేకంగా ఓటేశారు.
577 మంది సభ్యులుఉన్న నేషనల్ అసెంబ్లీ దిగువ సభలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి 331 మంది ఎంపీలు ఓటేశారు. దీంతో తీర్మానం నెగ్గింది. ప్రధాని తన పదవిని పోగొట్టుకున్న దుస్థితి. దీంతో తన రాజీనామా పత్రాన్ని ఆయన దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ కు అందజేశారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. గడిచిన 60 ఏళ్లలో ఆ దేశ చరిత్రలో పార్లమెంటులో విపక్షాలు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గటం ఇదే తొలిసారి. అక్కడి నిబంధనల ప్రకారం ఈ మేలో ఎన్నికల జరిగిన నేపథ్యంలో మళ్లీ ఎన్నికలకు అవకాశం లేదు. కొత్త ప్రధానమంత్రిని ఎంపిక చేసుకునే వీలుంది.
ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. ఎన్నికల అనంతరం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన గేబ్రియల్ కొద్దికాలానికే తన పదవి నుంచి దూరం కాగా.. ఆయన స్థానాన్ని బార్నియర్ చేపట్టారు. మళ్లీ మూడు నెలల వ్యవధిలోనే ఆయన ప్రభుత్వంపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం పుణ్యమా అని ఆయన పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. దీంతో కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకోవాల్సి వస్తుంది. అవిశ్వాస తీర్మానానికి దేశాధ్యక్షుడు మేక్రాన్ కు సంబంధం లేని కారణంగా.. ఆయన పదవికి ఢోకా లేదనే చెప్పాలి.