స్లమ్స్ లో పర్యటించిన బిల్ గేట్స్... భారత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు!
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి ఒడిశాలోని భువనేశ్వర్ లోని ఒక మురికివాడను సందర్శించారు
By: Tupaki Desk | 28 Feb 2024 10:44 AM GMTమైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి ఒడిశాలోని భువనేశ్వర్ లోని ఒక మురికివాడను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మా మంగళ బస్తీలోని బిజూ ఆదర్శ్ కాలనీని సందర్శించిన ఆయన... అక్కడి నివాసితుల శ్రేయస్సు గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో ఆ ప్రాంతంలో యాక్టివ్ గా మహిళా స్వయం సహాయక బృందాలతో సంభాషించారు.
అవును... ఒడిశాలో పర్యటిస్తున్న బిల్ గేట్స్ భువనేశ్వర్ లోని ఒక మురికివాడలో పర్యటించారు. ఈ సందర్భంగా... మురికివాడల నివాసితులకు భూమి హక్కులు, కుళాయి నీరు, విద్యుత్, పారిశుద్ధ్య సౌకర్యాలుతో సహా అందిస్తున్న సౌకర్యాలను గేట్స్ కు రాష్ట్ర అభివృద్ధి కమీషనర్ అను గార్గ్ వివరించారు. ఇదే సమయంలో... అనేక రకాల ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులతో బిల్ గేట్స్ చర్చల గురించి రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి మతి వతనన్ ప్రస్తావించారు.
ఈ సమయంలో... వారి వారి జీవితాలపై ఈ పథకాల ప్రభావంపై బిల్ గేట్స్ స్థానిక ప్రజానికాన్ని ఆరాతీస్తూ కాసేపు వివరాలు అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా... బిల్ గేట్స్ గతంలో మీ జీవితాలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా మారాయి అనే విషయాలను తమను అడిగి తెలుసుకున్నారని స్థానిక మహిళలలు వెల్లడించారు. ఈ క్రమంలో తర్వాత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో బిల్ గేట్స్ భేటీ కానున్నారు.
కాగా... రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలు బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ తో కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే!
ఇక తన ఒడిశా పర్యటనకు ముందు తన బ్లాగ్ లో స్పందించిన బిల్ గేట్స్... తన పర్యటనలో భాగంగా భారతదేశ డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ చర్యను చూస్తానని తెలిపారు. ఇదే సమయంలో ఒడిశాలోని వ్యవసాయ పర్యవేక్షణ కేంద్రాన్ని సందర్శించాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో 7.5 మిలియన్ల మంది రైతుల డేటాబేస్ ను నిర్వహిస్తోందంటూ ఆధార్ ను ప్రశంసించారు!
దీనివల్ల భూమి యాజమాన్యంతో సంబంధం లేకుండా, వారి వారి పంట వివరాలతో పాటు.. వ్యవసాయ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, ఏఐ సాంకేతికతను ఉపయోగించి స్థానిక భాషల్లో సమాచారాన్ని అందించే చాట్ బాట్ ద్వారా నిర్దిష్ట అవసరాల ఆధారంగా తగిన సలహాలను అందించడానికి అధికారులను అనుమతిస్తుందని తెలిపారు!
ఇదే సమయంలో... ప్రపంచ ఆరోగ్యానికి, ప్రధానంగా టీకా రంగంలో భారత దేశం అందిస్తున్న సహకారాన్ని బిల్ గేట్స్ హైలైట్ చేశారు. తక్కువ ఆదాయ దేశాలలో 1 బిలియన్ కు పైగా పిల్లలకు టీకాలు వేయడంలో కీలకమైన సంస్థ ద్వారా పంపిణీ చేయబడిన వాటిలో 60 శాతానికి పైగా వ్యాక్సిన్ ల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా నిలుస్తుందని ఆయన నొక్కి చెప్పారు!