Begin typing your search above and press return to search.

పరేషాన్ చేసిన క్రౌడ్ స్టైక్స్ కంపెనీకి డ్యామేజ్ ఎంత?

టెక్నాలజీతో అంత పెద్ద ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసి.. ఎన్నో సౌకర్యాలు సదుపాయాలు ముంగిట్లోకి వచ్చేశాయి

By:  Tupaki Desk   |   21 July 2024 10:30 AM GMT
పరేషాన్ చేసిన క్రౌడ్ స్టైక్స్ కంపెనీకి డ్యామేజ్ ఎంత?
X

టెక్నాలజీతో అంత పెద్ద ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసి.. ఎన్నో సౌకర్యాలు సదుపాయాలు ముంగిట్లోకి వచ్చేశాయి. అయితే.. ఒక్కోసారి సదరు సాంకేతికతలో తలెత్తే లోపాలు యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో తలెత్తిన సాంకేతిక సమస్యతో దేశాలకు దేశాలు ఎలా తల్లడిల్లిపోయాయో తెలిసిందే. తప్పుడు అప్ డేట్ ఈ మొత్తం సమస్యకు కారణమన్న సంగతి తెలిసిందే. మైక్రోసాఫ్ట్ సంస్థకు సెక్యూరిటీ వాల్ గా పని చేసే కంపెనీల్లో ఒకటైన క్రౌడ్ స్ట్రైక్స్ ఈ మొత్తం పరేషాన్ కు కారణమన్న సంగతి తెలిసిందే.

ప్రపంచాన్ని ఆగమాగం చేసిన ఈ సంస్థకు... తాజా పరేషాన్ తర్వాత ఏం జరిగింది? అన్న విషయంలోకి వెళితే.. తాను చేసిన తప్పునకు సదరు సంస్థ భారీగా మూల్యం చెల్లించుకోక తప్పలేదు. తన తప్పుడు అప్డేట్ కారణంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఈ సంస్థ షేర్ వాల్యూ ఒక్కసారిగా 11 శాతానికి పడిపోయింది. దీంతో.. 42.22 డాలర్లు ఉన్న షేర్.. ఒక్కసారి 30 డాలర్లకు పడిపోయింది. దీంతో సంస్థ మొత్తం విలువ 83 బిలియన్ డాలర్లకు పైనే ఉండగా.. తాజా పరిణామంతో సదరు సంస్థకు జరిగిన నష్టం 900 కోట్ల డాలర్లకు పైనే ఉందంటున్నారు. ఈ మేరకు సదరు సంస్థ షేరు విలువ మార్కెట్ లో హరించుకుపోయింది.

ఇంతకాలం ప్రపంచంలోనే అగ్రశ్రేణి సైబర్ సెక్యూరిటీ సంస్థగా నిలిచిన క్రౌడ్ స్ట్రైక్ కు ఉన్న ఇమేజ్ సైతం భారీగా దెబ్బతింది. ఈ సంస్థకు ఇంతకాలం దిగ్గజ కంపెనీలు క్లయింట్లుగా ఉన్నారు. తాజా పరిణామంతో తమ సంస్థల సైబర్ సెక్యూరిటీ బాధ్యతల్ని ఇతర కంపెనీలకు ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ జాబితాలో ప్రపంచ కుబేరుడు.. టెస్లా.. ఎక్స్ సంస్థల సీఈవో ఎలాన్ మస్క్ తాజాగా చేరారు. తమ వ్యవస్థల నుంచి క్రౌడ్ స్ట్రౌక్ ను తొలగించినట్లుగా ఆయన పేర్కొన్నారు.

తాజా పరిణామంతో క్రౌడ్ స్ట్రైక్ కు ప్రత్యర్థిగా ఉన్న సెంటినల్ వన్.. పాలో ఆల్టో నెట్ వర్కు లాంటి సంస్థలు లాభపడుతున్నాయి. ఇప్పటికే మార్కెట్ లో షేరు విలువ దారుణంగా పడిపోగా.. మరోవైపు పరిహారం పేరుతో కంపెనీలు క్యూ కట్టనున్నట్లు చెబుతున్నారు. తమకు జరిగిన నష్టాన్ని క్రౌడ్ స్ట్రైక్ బాధ్యత వహించాలని కోరుతున్నట్లు చెబుతున్నారు. ఈ లిస్టులో మైక్రోసాఫ్ట్ కూడా ఉంది. తాజా పరేషాన్ కారణంగా మైక్రోసాఫ్ట్ షేరు విలువ సైతం పడిపోవటం తెలిసిందే. మొత్తంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన క్రౌడ్ స్ట్రైక్ తనకు తాను తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి.