Begin typing your search above and press return to search.

బీజేపీ నుంచి మంత్రి పదవి ఆఫర్...మిధున్ రెడ్డి సంచలన కామెంట్స్

వైసీపీ భారీ ఓటమి తరువాత తొలిసారి ఒక యూట్యూబ్ చానల్ కి మిధున్ రెడ్డి పూర్తి స్థాయి ఇంటర్వ్యూ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   11 Aug 2024 10:01 AM GMT
బీజేపీ నుంచి మంత్రి పదవి ఆఫర్...మిధున్ రెడ్డి సంచలన కామెంట్స్
X

పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, వైసీపీకి ఉన్న స్ట్రాంగ్ యంగ్ లీడర్స్ లో ఒకరు. మూడు సార్లు రాజంపేట నుంచి ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. వైసీపీకి లోక్ సభలో నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రొటెం స్పీకర్ గా కూడా లోక్ సభలో వ్యవహరించారు. జగన్ కి అత్యంత సన్నిహిత నేతలలో ఆయన ఒకరు. వైసీపీ భారీ ఓటమి తరువాత తొలిసారి ఒక యూట్యూబ్ చానల్ కి మిధున్ రెడ్డి పూర్తి స్థాయి ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మనసు విప్పి మాట్లాడారు. అనేక సంచలన విషయాలనూ వెల్లడించారు. మిధున్ రెడ్డి బీజేపీలోకి వెళ్లబోతున్నారు అంటూ వస్తున్న ఆరోపణల మీద ఆయన సరైన జవాబు చెప్పారు. ఈ ఆరోపణలను తానూ వింటున్నాను అని అన్నారు. తాను జగన్ ని పార్టీని నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చాను అని అన్నారు. జగన్ తనకు అనేక అవకాశాలు చిన్న వయసులోనే ఇచ్చారని గుర్తు చేశారు.

రాజకీయం అన్నది అభిమానం మీద ఆధారపడి ఉంటుందని తాను తనకు జగన్ తో వైసీపీతో ఎమోషనల్ బాండేజ్ ఉందని అన్నారు. రాజకీయం అంటే వ్యాపారం కాదని ఆయన అన్నారు. నష్టాలు వచ్చాయని ఉన్న రాజకీయ పార్టీని వదిలేసి వేరే రాజకీయ పార్టీకి తాను వెళ్లే రకం కాదని అన్నారు. క్యారెక్టర్ ముఖ్యం అని ఆయన చెప్పారు.

తాను బీజేపీలోకి వెళ్తున్నాను అన్న దానిని ఇపుడే కాదని 2014 టైంలోనూ ప్రచారం చేశారు అని మిధున్ రెడ్డి గుర్తు చేశారు. అప్పట్లో బీజేపీతో చేరితే కేంద్ర మంత్రి పదవి ఇస్తామని కూడా ఆఫర్ చేశారని అన్నారు. కానీ తాను ఆనాడూ వెళ్లలేదు, ఈనాడు వెళ్ళేది లేదని అన్నారు. తాను ఎప్పటికీ వైసీపీని విడిచిపెట్టి వెళ్ళేది లేదని అన్నారు.

తమ కుటుంబం మీద వస్తున్న అవినీతి ఆరోపణలు అన్నీ బురదజల్లే కార్యక్రమంగా ఆయన తేల్చేశారు. అఫిడవిట్ లో ఏ అంశాలు పెట్టామో అవే మా ఆస్తులుగా ఉన్నాయని చెప్పారు. దానికి మించి సెంటు భూమి తమకు అదనంగా ఉందని నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటామని సవాల్ చేశారు. మదనపల్లిలో ఫైల్స్ కాలిపోయాయని అంటూ తమ మీద నిందలు వేస్తున్నారని ఆయన అన్నారు.

ఇపుడు టెక్నికల్ యుగం నడుస్తోందని ఫైలెస్ అన్నీ ఆన్ లైన్ లో ఉంటాయన్నది అందరికీ తెలుసు అన్నారు. ఎమ్మార్వో ఆఫీసులో ఫైల్స్ పోతే సాఫ్ట్ వేర్ లో ఉండవా అని ఆయన ప్రశ్నించారు. కేవలం విష ప్రచారం చేయడం కోసమే ఇదంతా అని ఆయన కొట్టి పారేశారు.

చంద్రబాబుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్యన గొడ్వ ఏంటి అన్న దానిని బదులిస్తూ తన తండ్రి ఎస్వీ యూనివర్శిటీలో గోల్డ్ మెడల్ స్టూడెంట్ అని పీహెచ్ డీ పూర్తి చేసి రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. తన తండ్రికి చంద్రబాబు రెండేళ్ళు సీనియర్ అని చెప్పారు. మొదట కాలేజ్ చైర్మన్ గా చంద్రబాబు గెలిచారని ఆ తరువాత తన తండ్రి గెలిచారని అన్నారు.

ఆనాటి నుంచే చంద్రబాబు ప్రత్యర్ధిగా తన తండ్రిని భావించారు అని అన్నారు. తన తండ్రి ఇప్పటికి పది సార్లు ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఎవరినీ ఒక్క రూపాయి బెదిరించి తీసుకున్నది లేదని అన్నారు. తమకు ఏపీతో పాటు అనేక రాష్ట్రాలలో అలాగే ఇతర దేశాలలో వ్యాపారాలు ఉన్నాయని మిధున్ రెడ్డి చెప్పారు. తాము న్యాయంగా వ్యాపారాలు చేస్తామని వాటి నుంచే తాము రాజకీయాలకు ఖర్చు చేస్తామని అన్నారు.

రాజకీయాల నుంచి డబ్బులు దండుకుని జీవించే అవసరం తమకు లేదని ఆయన అన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో కూడా తమకు వైరం ఏమీ లేదని ఆయనకు ప్రజల్లో బలం లేదని అందుక తమను చూస్తే అసూయ అన్నారు. తాజా ఎన్నికల్లో రాజం పేటలో ఎనభై వేల ఓట్ల తేడాతో తన మీద కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి పాలు అయ్యారని అక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచిన కూటమి అభ్యర్ధుల కంటే కూడా కిరణ్ కుమార్ రెడ్డికి తక్కువ ఓట్లు వచ్చాయని అన్నారు.

తాము ఎన్డీయేకు ఇండియా కూటమికి కూడా దూరం అని చెప్పారు మంచి పాలసీలు తెస్తే ప్రజా ప్రయోజనాల దృష్ట్యానే తాము బీజేపీ బిల్లులకు మద్దతు ఇచ్చామని అన్నారు. ట్రిపుల్ తలాఖ్ తో పాటు యూనిఫాం సివిల్ కోడ్ ని తాము వ్యతిరేకించామని ఆయన పేర్కొన్నారు. తాజాగా చూసినా వక్ఫ్ బోర్డు బిల్లుని తాము వ్యతిరేకించామని అన్నారు.

వైసీపీలో కష్టపడి పనిచేసిన వారికే పదవులు ఇస్తారని ఆయన అన్నారు. తాను గానీ వైవీ సుబ్బారెడ్డి కానీ విజయ్ సాయిరెడ్డి కానీ మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వారమని ఆయన గుర్తు చేశారు. వైసీపీ ఒక వర్గానికి అందలం ఎక్కించే పార్టీ కాదని అన్నారు. తాము ఎన్ని మంచి పనులు చేసినా కొన్ని తప్పులు కూడా జరిగి ఉంటాయని వాటిని తాము తెలుసుకుని సవరించుకుంటామని అన్నారు. జగన్ తమకు బలమని జగన్ నాయకత్వంలో మళ్లీ వైసీపీ బలం పుంజుకుంటుందని అన్నారు.

చంద్రబాబు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తే స్వాగతిస్తామని కానీ ఆయన హామీలు నెరవేర్చకపోతే మాత్రం ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామని అన్నారు. రెండు నెలలలోనే ప్రజలకు కూటమి ప్రభుత్వం తీరు ఏమిటో అర్ధం అయిందని మిధున్ రెడ్డి అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అన్నది లేదని ఆయన మరో కామెంట్ చేశారు. వైసీపీని దెబ్బ తీయడానికి కాంగ్రెస్ అభ్యర్థులను గత ఎన్నికలో బీ ఫారాలు ఇప్పించి మరీ పెట్టించిందే టీడీపీ అని ఆ పార్టీల మధ్య అవగాహన ఉందని మిధున్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.