కుప్పకూలిన సైనిక విమానం.. 74 మంది మృతి!
ఆ సమయంలో విమానంలో సుమారు 74 ఉన్నారని.. వారంతా దుర్మరణం చెందరని తెలుస్తుంది.
By: Tupaki Desk | 24 Jan 2024 3:12 PM GMTరష్యా – ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం అవిరామంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఈ యుద్ధం ఇరుదేశాలలో కలిగించిన ప్రాణనష్టం భారీగా ఉందనే లెక్కలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో తాజాగా ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యాకు చెందిన ఒక విమానం కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో సుమారు 74 ఉన్నారని.. వారంతా దుర్మరణం చెందరని తెలుస్తుంది.
అవును... ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా సైనిక రవాణా విమానం(ఐఎల్ - 76) కుప్పకూలింది. దీంతో... అందులో ప్రయాణిస్తున్న మొత్తం 74 మంది దుర్మరణం చెందారు. వీరిలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు కాగా... మిగిలిన తొమ్మిది మంది సిబ్బంది అని రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్ సమీపంలోని బెల్గోరాడ్ లో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అయితే ఆ విమానాన్ని తమ రక్షణ బలగాలు కూల్చివేసినట్లు ఉక్రెయిన్ లోని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఆ విమానంలో ఉన్నది యుద్ధ ఖైదీలు కాదని పేర్కొంది. అందులో రష్యా క్షిపణులను తరలిస్తోందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే... రష్యా మాత్రం ఈ వాదనతో ఏకీభవించడంలేదు. ఆ విమానంలో ఉన్నది యుద్ధ ఖైదీలేనని చెప్తోంది.
తాజాగా ఈ విషయాలపై స్పందించిన రష్యా పార్లమెంట్ స్పీకర్... సొంత సైనికులు వెళ్తున్న విమానాన్ని వారు కూల్చివేశారని.. మానవతా మిషన్ లో భాగమైన తమ పైలట్లు అందులో ఉన్నారంటూ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే... ఈ సైనిక రవాణా విమానంలో బలగాలు, సరకులు, సైనిక సాధనాలను తరలించే వీలుంటుంది!
ఇక, ఈ విమానం కుప్పకూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించిన ఆ వీడియోల్లో.. ప్రమాదానికి ముందు విమానం అదుపుతప్పి వేగంగా కిందికి పడిపోతున్నట్లు కనిపిస్తోంది. తర్వాత ఇది నివాసప్రాంతాల వద్ద నేలను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.