7 కాదు 9.. గేర్ మార్చిన ఎంఐఎం
ఇదే విషయాన్ని తాజాగా ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. "మేం 9 స్థానాల్లో పోటీ చేయాలని అనుకుంటున్నాం" అని ఆయన చెప్పారు.
By: Tupaki Desk | 3 Nov 2023 1:21 PM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు స్థానాలకు మాత్రమే పరిమితమై పోటీ చేస్తున్న మజ్లిస్ పార్టీ ఎంఐఎం.. తాజా ఎన్నికల్లో గేర్ మార్చింది. ఈ సారి ఎన్నికల్లో ఏడు స్థానాలకు బదులుగా మరో రెండు స్థానాలను కూడా ఎంచుకుని.. పోటీకి రెడీ అయింది. ఇదే విషయాన్ని తాజాగా ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. "మేం 9 స్థానాల్లో పోటీ చేయాలని అనుకుంటున్నాం" అని ఆయన చెప్పారు.
తాజాగా ప్రకటించిన రెండు నియోజకవర్గాలు.. రాజేంద్రనగర్, జూబ్లీ హిల్స్ ఉన్నాయి. ఈ రెండు చోట్లా కూడా ఎంఐఎం పోటీ చేయడం ఇదే తొలిసారి. ఇక, ఇప్పటి వరకు సంప్రదాయంగా ఎంఐఎం పోటీ చేస్తున్న నియోజకవర్గాలు.. వరుసగా.. చంద్రాయణగుట్ట, నాంపల్లి, చార్మినార్, యాకుత్‌పురా, మలక్‌పేట, బహదూర్‌పురా, కార్వాన్‌లు ఉన్నాయి. వీటి నుంచి ఎంఐఎం గెలుపు గుర్రం ఎక్కుతున్న విషయం తెలిసిందే.
ఇక, ఆయా స్థానాల్లో చంద్రాయణ గుట్ట నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ, నాంపల్లి నుంచి మాజిద్ హుస్సేన్‌లకు టికెట్లు ఖరారు చేశారు. అదేవిధంగా చార్మినార్ నుంచి జుల్పికర్, యాకుత్పురా నుంచి మిరాజ్, మలక్ పేట నుంచి బలాల, కార్వాన్ నుంచి మొయినుద్దీన్ రంగంలోకి దిగనున్నారు. తాజాగా ప్రకటించిన రెండు నియోజకవర్గాలు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ సహా బహదూర్ పురా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
ఇదిలావుంటే.. ఈ సారి గతానికి భిన్నంగా ఎంఐఎం కూడా అసంతృప్తుల సెగను ఎదుర్కొంటోంది. చార్మినార్, బహదూర్‌పురాల్లో అభ్యర్థులను మార్చడం.. పార్టీలో కలకలం రేపింది. దీంతో ఎంఐఎం నుంచి టికెట్లు రాని ఒకరిద్దరు అభ్యర్థులు స్వతంత్రంగా పోటీకి దిగనున్నారని తెలుస్తోంది. మొత్తానికి 7 నుంచి 9కి ఎంఐఎం పోటీ చేయడం.. కీలకమైన జూబ్లీహిల్స్‌ను ఎంచుకోవడం.. చర్చనీయాంశంగా మారింది.