మధ్యలో మజ్లీస్ అధికారం ఆశలు...!
హోరా హోరీ పోరులో మన ప్లేస్ ఎక్కడ అని ప్రధాన పార్టీలు తలలు పట్టుకుంటున్న నేపధ్యం తెలంగాణాలో ఉంది.
By: Tupaki Desk | 29 Oct 2023 11:30 PM GMTహోరా హోరీ పోరులో మన ప్లేస్ ఎక్కడ అని ప్రధాన పార్టీలు తలలు పట్టుకుంటున్న నేపధ్యం తెలంగాణాలో ఉంది. మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో అరవై సీట్ల సింపుల్ మెజారిటీ రావడానికి ఏమేమి చేయాలా అని అటు కాంగ్రెస్ ఇటు బీయారెస్ బుర్రలు బద్ధలు కొట్టుకుంటూంటే మధ్యలో మజ్లీస్ పార్టీ కొత్త ఆశలతో ఆరాటపడుతోంది అని అంటున్నారు.
ఈసారి కూడా బీయారెస్ అధికారంలోకి వస్తుంది అని మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఢంకా భజాయిస్తున్నారు. తన పార్టీ నేతల మీటింగులో ఆయన మాట్లాడుతూ ఈసారి అధికారంలో తామూ వాటాదారులం అవుతామన్న మాటలను వాడడమే ఆసక్తిని కలిగిస్తోంది. అంటే బీయారెస్ కి పూర్తి మెజారిటీ రాదని మజ్లీస్ నిర్ణయించేసిందా అన్న చర్చ సాగుతోంది.
అసలే ఒక వైపు కాంగ్రెస్ గ్రాఫ్ నానాటికీ పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నలభై నుంచి యాభై దాకా వెళ్ళి ఇపుడు సింపుల్ మెజారిటీ మార్క్ ని దాటి కాంగ్రెస్ ముందుకు సాగుతుంది అని సర్వే నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఓడితే ఏముంటుంది ఇంట్లో రెస్ట్ తీసుకుంటామని సాక్ష్తాత్తూ కేసీయారే ఒక సభలో మాట్లాడి షాక్ తినిపించేసారు.
వాతావరణం ఇలా ఉంటే మజ్లీస్ మామ పార్టీ హ్యాట్రిక్ కొడుతుంది అని కేసీయార్ మీద ప్రశంసలు కురించేశారు. అందులో కండిషన్ అన్నట్లుగా మేమూ ఉంటామని అంటున్నారు. అసదుద్దీన్ వ్యాఖ్యలను బట్టి అర్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే బీయారెస్ కి అరవై సీట్లు కూడా రావు అని, వస్తే గిస్తే ఏ 55 దగ్గరో ఆగిపోతుందని, అపుడు తనకు గ్యారంటీగా వచ్చే ఏడెనిమిది సీట్లను జత కలిపి సంకీర్ణ ప్రభుత్వం తెలంగాణాలో ఏర్పాటు చేద్దామని అంటున్నట్లుగా తెలుస్తోంది.
ఈసారి ప్రభుత్వంలో మనముంటాం, ముస్లిం సమాజం అంతా జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా అసదుద్దీన్ మాట్లాడినట్లుగా తెలుస్తోంది. అంటే మజ్లీస్ కి అధికారంలో వాటా కావాలని అర్ధం అయింది అంటున్నారు. నిజానికి 2018లో కూడా అనేక సర్వేలు వచ్చాయి. పోలింగ్ ముగిసి రిజల్ట్ రావడానికి కొద్ది రోజుల ముందు కూడా బీయారెస్ కి మెజారిటీ వస్తుందా అన్న డౌట్లు వచ్చాయి.
అయితే ఆ సమయంలో కేసీయార్ పిలుపు మేరకు మజ్లీస్ అధినేత అసదుద్దీన్ వెళ్ళి ఆయన్ని కలసి వచ్చారు. మద్దతు మీద పూర్తి హామీ కూడా ఇచ్చారు. అప్పట్లోనే మజ్లీస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడుతుందని అంతా అనుకున్నారు. అయితే రిజల్ట్స్ మాత్రం బీయారెస్ కి బ్రహ్మరధం పట్టాయి. దాంతో మజ్లీస్ అవసరం లేకుండా పోయింది. ఈసారి అయితే అలాంటి ఆశలు పెట్టుకునే ఒవైసీ ఉన్నారని అంటున్నారు.
మరి అలాగే జరుగుతుందా మజ్లీస్ కూడా ప్రభుత్వంలో చేరుతుందా చేరితే అపుడు మజ్లీస్ మంత్రులను తెలంగాణాలో చూస్తారా. అధికారంలో వాటాను తీసుకుని మజ్లీస్ అంతటితో ఆగుతుందా తెలంగాణా రాజకీయాన్ని మలుపు తిప్పే వ్యూహాలను పదును పెడుతుంద ఇవన్నీ చూడాలంటే డిసెంబర్ 3 వరకూ ఆగాల్సిందే మరి.