కీలక బిల్లుకు పెద్దల సభ ఓకే.. ఖనిజాల తవ్వకాలు ప్రైవేటుకు
దీంతో చట్టంగా మారనున్న ఈ బిల్లులోని అంశాల్ని చూస్తే దీనిపై జరగాల్సినంత చర్చ జరగలేదన్న భావన కలుగక మానదు
By: Tupaki Desk | 3 Aug 2023 5:08 AM GMTమణిపూర్ లో జరుగుతున్న ఆరాచకాలు.. మరోవైపు హర్యానాలో పెరిగిన ఘర్షణల వేళ.. పార్లమెంట్ ఉభయ సభలు సరిగా జరగని పరిస్థితి. మణిపూర్ ఉదంతంపై ప్రధాని నరేంద్ర మోడీ సభకు వచ్చి ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టటం.. అందుకు అధికారపక్షం సిద్దంగా లేకపోవటం తెలిసిందే. దీంతో.. పార్లమెంటు ఉభయ సభల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగటం లేదు. సభ కొలువు తీరినంతనే విపక్షాలు నిరసనను వ్యక్తం చేస్తూ.. సభను జరగనివ్వని పరిస్థితి.
ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఒక బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీంతో చట్టంగా మారనున్న ఈ బిల్లులోని అంశాల్ని చూస్తే.. దీనిపై జరగాల్సినంత చర్చ జరగలేదన్న భావన కలుగక మానదు. ఖనిజాల అభివృద్ధి నియంత్రణ సవరణ బిల్లు, 2023కు పెద్దల సభగా పిలిచే రాజ్యసభ ఆమోద ముద్ర వేయటంతో ఇది చట్టంగా మారనుంది. దీని ప్రకారం విలువైన ఖనిజాల తవ్వకాలను ఇకపై ప్రైవేటు సంస్థలు చేపట్టనున్నాయి.
ఈ బిల్లు ఆమోదంతో లిథియంతో సహా ఆరు అణు ఖనిజాలు వజ్రాలు.. బంగారం.. వెండి లాంటి వాటిని తవ్వి తీసేందుకు ప్రైవేటు రంగానికి అనుమతి లభించినట్లైంది. ఇప్పటివరకు ప్రభుత్వ సంస్థల ద్వారా మైనింగ్ చేస్తున్న 12 రకాల అణు ఖనిజాల్లో ఆరింటిని ప్రైవేటు రంగానికి అందించారు. ఈ నేపథ్యంలో లిథియం, బెరీలియం, నియోబియం, టైటానియం, టాంట్లామ్, జిర్కోనియం ఖనిజాల్ని ప్రైవేటు సంస్థలు మైనింగ్ చేసే వీలు కలుగుతుంది. తాజా బిల్లు ఆమోదం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఖనిజాల వెతుకులాట పెరగటంతో పాటు.. పలు ప్రైవేటు సంస్థలు రంగంలోకి దిగనున్నాయి.