అటూ ఇటూ కాకుండా పోయిన జోగి రాజకీయం... !
తన మనసులో ఏముందో ఏమో తెలియదు కానీ.. టీడీపీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ వెళ్తున్నట్టుగా తాను కూడా.. వైసీపీకి గుడ్ బై చెప్పాలని భావించి ఉంటారన్న చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 17 Dec 2024 6:29 AM GMTసీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ రాజకీయంగా తప్పుడు దారిలో వెళ్తున్నారా? ఆయన వ్యవహార శైలితో రెంటికీ చెడ్డ రేవడిలా మారుతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తన మనసులో ఏముందో ఏమో తెలియదు కానీ.. టీడీపీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ వెళ్తున్నట్టుగా తాను కూడా.. వైసీపీకి గుడ్ బై చెప్పాలని భావించి ఉంటారన్న చర్చ సాగుతోంది.
రాజకీయాల్లో మార్పులు సహజమే అయితే... ఆ మార్పు ఆహ్వానించేదిగా ఉండాలి. కానీ, నిన్న మొన్నటి వరకు తిట్టిపోసిన పార్టీలోకి వెళ్తున్నట్టుగా జోగి రమేష్ సంకేతాలు ఇచ్చారు. నేరుగా పోయి.. మంత్రి పార్థ సారథితో కలిసి పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనిపై పెద్ద ఎత్తున టీడీపీ నుంచి నిరసన వ్యక్తమైంది. మంత్రి కొలుసు ఈ విషయంలో సారీ కూడా చెప్పారు. అయితే.. ఈ పరిణామంతో జోగికి టీడీపీ నుంచి ఎలాంటి సానుకూల స్వాగతాలు లభించడం లేదన్న సంకేతాలు వచ్చినట్టు అయింది.
ఇక, మరోవైపు.. ఈ విషయంపై వైసీపీ కూడా సీరియస్ అయింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ.. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి జోగికి ఇప్పటికే స్పష్టం చేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ.. ప్రత్యర్థిపార్టీతో అంటకాగడంపై జగన్ సీరియస్‌గా ఉన్నారని ఆయన తెలిపారు. దీనిపై వివరణ ఇవ్వకపోతే... పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం కూడా పార్టీలో నేతల మధ్య చర్చ సాగుతోంది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా ఖాయమన్న సంకేతాలు కూడా వస్తున్నాయి.
ఎందుకిలా జరిగింది.. ?
జోగి విషయంలో జగన్ చాలా సానుకూల నిర్ణయాలే తీసుకున్నారు. బీసీ సామాజిక వర్గంలో దూకుడు నాయకుడిగా ఉన్న ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. అదేవిధంగా పార్టీలో ఆయన కోరుకున్న మైలవరం సీటుకు కూడా తాజాగా పంపించారు. పార్టీలోనూ గుర్తింపు ఇచ్చారు. మరి ఇంత చేసినా.. ఎందుకు జోగి ఇలా చేశారన్నది ప్రశ్న. అగ్రిగోల్డ్ భూముల కేసులో పార్టీ తనను పట్టించుకోలేదన్న అక్కసు ఆయనలో ఉందని తెలుస్తోంది. పార్టీ పరంగా తనకు సాయం అందలేదని.. ఆయన అనుచరులు చెబుతున్నారు. సో.. ఈ క్రమంలోనే జోగి మనసు టీడీపీవైపు మళ్లిందన్న చర్చ సాగుతుండడం గమనార్హం.