నీటి గ్లాసులో చెయ్యి.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి మేనల్లుడి హత్య
ఇప్పుడు మరో కేంద్ర మంత్రి బంధువులకు సంబంధించిన విషయం చర్చనీయాంశంగా మారింది.
By: Tupaki Desk | 20 March 2025 5:20 PM ISTటీనేజీ వయసున్న తన కూతురిని కొందరు వేధించారంటూ ఇటీవల కేంద్ర యువజన క్రీడల శాఖ మంత్రి రక్షా ఖడ్సే పోలీసులకు ఫిర్యాదు చేయడం వింత గొలిపిన సంగతి తెలిసిందే.. సాక్షాత్తు కేంద్ర మంత్రి కూతురికే రక్షణ లేకపోతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏమిటనే చర్చ అప్పట్లో సోషల్ మీడియాలో నడిచింది. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఖడ్సే కూతురు, ఆమె స్నేహితురాళ్లపై ఆకతాయిలు వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ఆమె ముక్తైనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఇప్పుడు మరో కేంద్ర మంత్రి బంధువులకు సంబంధించిన విషయం చర్చనీయాంశంగా మారింది. అది కూడా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కుటుంబానికి చెందినది కావడం గమనార్హం.
నిత్యానందరాయ్ బిహార్ కు చెందిన నాయకుడు. మోదీ ప్రభుత్వంలో చాన్నాళ్లుగా మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈయన ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రాయ్ మేనల్లుడు తుపాకీ కాల్పుల్లో చనిపోయాడు. అయితే, ఈ దారుణానికి ఒడిగట్టింది కూడా రాయ్ మరో మేనల్లుడు కావడం చర్చనీయాంశమైంది. ఈ మేనల్లుళ్ల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
బిహార్ రాష్ట్రం భాగల్ పూర్ సమీపంలోని జగత్‌పుర్ గ్రామంలో రాయ్ బావ రఘనందన్ యాదవ్ కుటుంబం నివసిస్తోంది. ఈయనకు ఇద్దరు కుమారులు జైజిత్ యాదవ్, విశ్వజిత్ యాదవ్. కాగా, తాగునీటి విషయమై వారి మధ్య వివాదం చెలరేగి, హత్యకు దారితీసిందని జాతీయ మీడియా పేర్కొంటోంది.
కాగా, కుమారుల మధ్య వివాదాన్ని ఆపేందుకు వచ్చిన రాయ్ సోదరికి బుల్లెట్ గాయం అయిందట. ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
తాగబోయే నీటిలో చేతిని ముంచడంతో..
జైజిత్ యాదవ్, విశ్వజిత్ యాదవ్ మధ్య చాన్నాళ్లుగా గొడవలు ఉన్నాయి. తాజాగా ఇంట్లో పనిచేసే సహాయకుడు తాగునీటిని అందిస్తుండగా సోదరుల్లో ఒకరు చేతిని ఆ గ్లాసులో ముంచారట. దీంతో గొడవ చెలరేగినట్లు తెలుస్తోంది. ఇది పెరిగి ఇద్దరు కాల్పులకు దిగారు. విశ్వజిత్ ప్రాణాలు కోల్పోయాడు.