రేవంత్ సర్కారుపై ప్రజా వ్యతిరేకత.... సీతక్క సంచలన వ్యాఖ్యలు
ప్రజా ప్రతినిధులు, అధికారుల నిలదీత పరిణామాలతో ఆందోళనలు సైతం జరిగాయి. దీనిపై ప్రభుత్వంలోని కీలక మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు.
By: Tupaki Desk | 22 Jan 2025 11:30 PM GMTతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భం ఓ వైపు మరోవైపు ముంచుకొస్తున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకు చేరువ అయేందుకు గ్రామ సభలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం నుంచి ఈ సభలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర భుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా , కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేసేందుకు ఈ గ్రామసభలు నిర్వహిస్తున్నారు. అయితే, పలు చోట్ల నిరసనలు ఎదురయ్యాయి. ప్రజా ప్రతినిధులు, అధికారుల నిలదీత పరిణామాలతో ఆందోళనలు సైతం జరిగాయి. దీనిపై ప్రభుత్వంలోని కీలక మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు.
తాజాగా సచివాలయంలో సీతక్క ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, గ్రామసభల్లోని ఆందోళనలపై స్పందించారు. గ్రామ సభల్లోనే అర్హులని గుర్తిస్తున్నామని తెలిపిన సీతక్క...పదేళ్ల తర్వాత గ్రామ సభలు కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. గతంలో ఎంఎల్ఏలు చెప్పిన వాళ్ళకే పథకాలు వచ్చేవని, ఫామ్ హౌస్ లో, ఎమ్మెల్యేలు ఇండ్లలో కూర్చొని లబ్ధిదారులను ఎంపిక చేశారని సీతక్క మండిపడ్డారు. తమ ప్రజా ప్రభుత్వం లో గ్రామ సభల్లోనే ప్రజల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని వివరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా లబ్ధిదారులను గుర్తిస్తుంటే కావాలని బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తుందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ఓట్లప్పుడే పథకాలు అరకొరగా ఇచ్చేవారని మండిపడ్డ సీతక్క ప్రజా అవసరాలు, ఆర్థిక వనరుల ను బట్టి పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. పదేళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదు..అందుకే ఉద్దేశ పూర్వకంగా బీఆర్ఎస్ గొడవలు సృష్టిస్తుందని మండిపడ్డారు.
ఈ సందర్బంగా నిరసనలపై సీతక్క క్లారిటీ ఇచ్చారు. మంగళవారం మొత్తం 3410 గ్రామాల్లో గ్రామసభలు జరిగాయని సీతక్క పేర్కొంటూ కేవలం 142 గ్రామాల్లోని ఆందోళనలు జరిగాయని స్వయంగా బీఆర్ఎస్ పత్రికలోనే చెప్పారని సీతక్క పేర్కొన్నారు. బీర్ఎస్ పత్రిక ప్రకారం చూసినా... కేవలం నాలుగు శాతం గ్రామాల్లోనే కొంత గొడవ జరిగిందని అంటే 96% గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో గ్రామసభలు జరిగినట్టు స్పష్టమవుతుంది సీతక్క వివరించారు. ఈ గొడవలు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఉద్దేశ పూర్వకంగా చేశారని సీతక్క మండిపడ్డారు.
లబ్దిదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీతక్క భరోసా ఇచ్చారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇతర పథకాలు ఇస్తామని ఎ ఒక్క అర్హుడు నష్టపోకుండా ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నామని, గ్రామ సభల్లో కూడా దరఖాస్తులు తీసుకుంటున్నామని వివరించారు. కేసీఆర్, కేటీఆర్ మాటలు నమ్మి కొందరు ఆర్థిక సామాజిక రాజకీయ కుల సమగ్ర ఇంటిటి సర్వేలో పాల్గొనలేదని, ఇప్పుడు వాళ్ళకి పథకాలు రావనే ఆందోళన ఉందని సీతక్క తెలిపారు. మంచిని తమ ఖాతాల్లో, చెడును మంది ఖాతాల్లో వేయడం బీఆర్ఎస్ కు అలవాటు అని సీతక్క మండిపడ్డారు.