Begin typing your search above and press return to search.

మీరిలా మాట్లాడటమా శ్రీధర్ బాబు? మీ స్థాయికి తగ్గించుకోవటమేంటి?

తాజాగా మంత్రి శ్రీధర్ బాబు వ్యవహారం అలానే ఉంది. ఎవరు అవునన్నా.. కాదన్నా ఆయన వ్యక్తిత్వాన్ని.. రాజకీయ నాయకుడిగా మిగిలినవారికి భిన్నంగా ఆయన శైలి ఉంటుంది

By:  Tupaki Desk   |   23 Sep 2024 4:18 AM GMT
మీరిలా మాట్లాడటమా శ్రీధర్ బాబు? మీ స్థాయికి తగ్గించుకోవటమేంటి?
X

కొంతమంది నేతలకు ఒకలాంటి ఇమేజ్ ఉంటుంది. దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉండి..కష్టం వచ్చినా.. నష్టం జరుగుతున్నాకూడా పట్టించుకోకుండా తమకున్న ఇమేజ్ ను చెడగొట్టుకోవటానికి అస్సలు ఇష్టపడరు. అలాంటి నేతలు కొన్నిచిన్న విషయాల్లో కలుగజేసుకొని.. మాట్లాడే మాటలు వారి మీద ఉన్నమర్యాదను.. గౌరవాన్ని తగ్గించేలా చేస్తాయన్న విషయాన్ని వారు మిస్ అవుతుంటారు. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు వ్యవహారం అలానే ఉంది. ఎవరు అవునన్నా.. కాదన్నా ఆయన వ్యక్తిత్వాన్ని.. రాజకీయ నాయకుడిగా మిగిలినవారికి భిన్నంగా ఆయన శైలి ఉంటుంది. వివాదాస్పద అంశాలకు.. తీవ్రమైన ఆరోపణలకు దూరంగా ఉంటారు.

రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆయన్ను ఒక మాట అనే ముందు కాస్త ఆలోచించి మాట్లాడే పరిస్థితి. అలాంటి శ్రీధర్ బాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి ఏ మాత్రం సూట్ అయ్యేలా లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదివారం మాదాపూర్ లోని ఒక స్టార్ హోటల్లో సీఎల్పీ నిర్వహించిన టీపీసీసీ అధ్యక్షుడి సన్మాన కార్యక్రమంలో పార్టీ నేతలంతా పాల్గొనటం.. ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడటం తెలిసిందే.

ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమెరికా పర్యటనలో ఉన్నకారణంగా హాజరు కాలేదు. మంత్రిసీతక్క వ్యక్తిగత కారణాలతో రాలేదు. ఖమ్మం జిల్లాకు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వారంతా హాజరయ్యారు. వీరితో పాటు ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయింపులకు పాల్పడిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు.. మొదట్లోనే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డి.. కడియం శ్రీహరి లాంటి వారుసైతం హాజరయ్యారు.

సీఎల్పీ సమావేశానికి గాంధీ హాజరుకావటంపై మంత్రి శ్రీధర్ బాబునుమీడియా ప్రశ్నించినప్పుడు.. ‘‘ఆయన సీఎల్పీ బేటీలో పాల్గొన్నట్లు మీరు చూశారా?’’ అని ప్రశ్నించారు. తాము నిర్వహించిన సమావేశం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జరగటంతో స్థానిక ఎమ్మెల్యే గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసేందుకు వచ్చారన్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో సిద్దిపేటకు వెళితే హరీశ్ రావు వెళ్లి కలవలేదా? అంటూ సంబంధం లేని వ్యాఖ్యలు చేసి పలుచన అయ్యారు. మిగిలిన నేతల సంగతి ఓకే. కానీ.. తనకంటూ ఒక మార్క్ ఉన్నశ్రీధర్ బాబు నుంచి ఈ తరహా వ్యాఖ్యలు ఊహించలేదన్న అభిప్రాయం పలువురి నుంచి వినిపిస్తుండటం గమనార్హం.