బాబు మెచ్చిన మంత్రులు ఎవరంటే ?
బాబు పెట్టుకున్న బెంచ్ మార్క్ ని రీచ్ అయిన మంత్రులుగా చూస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదటి ప్లేస్ లో ఉన్నారని అంటున్నారు.
By: Tupaki Desk | 20 Dec 2024 12:30 AM GMTముఖ్యమంత్రి చంద్రబాబుతో పని విషయంలో పరుగులు పెట్టడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పాలి. ఆయనను పని రాక్షసుడు అని కూడా చెప్పాలి. ముప్పయ్యేళ్ళ క్రితం బాబు సీఎం గా ఎంత చురుకుగా డైనమిక్ గా ఉంటారో ఇపుడు అలాగే ఉంటూ వస్తున్నారు. బాబు తనతో పాటు తన సహచర మంత్రులు అలాగే పరుగులు తీయాలని కోరుకుంటారు.
అంతే కాదు వారికి కూడా పారామీటర్స్ పెట్టి టెస్ట్ చేస్తూంటారు. అలా ప్రతీ నెలలోనూ మంత్రుల పనితీరు మీద మధింపు చేస్తూ బాబు వస్తున్నారు. దానికి ప్రోగ్రెస్ రిపోర్టులుగా చెబుతూంటారు. మరో వైపు చూస్తే చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో కూడా మంత్రులకు దిశా నిర్దేశం చేస్తూ ఉంటారు. మంత్రులు అంతా సక్రమంగా పనిచేయాలని సూచనలు చేస్తూ ఉంటారు.
ఇవన్నీ పక్కన పెడితే కూటమి ప్రభుత్వ పాలన ఆరు నెలల కాలం పూర్తి అయింది. దాంతో మంత్రుల పనితీరు మీద ముఖ్యమంత్రిగా చంద్రబాబు కచ్చితమైన అంచనాకు వచ్చారని అంటున్నారు. ఆయన అందరి మంత్రుల పనితీరుని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ వస్తున్నారు ఎవెరెవరు తమ వద్దకు వచ్చిన ఫైళ్లను క్లియర్ చేస్తున్నారు. ఎవరి వద్ద ఎక్కువ పెండింగులో ఉన్నాయన్న దాని మీద కూడా బాబుకు పూర్తి స్థాయిలో నివేదికలు ఉన్నాయి. ఇదే విషయం గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ఆయన మంత్రులతో చెప్పారని అంటున్నారు.
ఇదిలా ఉంటే చంద్రబాబు గుడ్ లుక్స్ లో ఉన్న మంత్రులు వీరే అంటూ ప్రచారం అయితే సాగుతోంది. ఆ మంత్రులు ఎవరూ అంటే ఆసక్తికరంగానే జాబితా కనిపిస్తోంది. బాబు పెట్టుకున్న బెంచ్ మార్క్ ని రీచ్ అయిన మంత్రులుగా చూస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొదటి ప్లేస్ లో ఉన్నారని అంటున్నారు. అదే విధంగా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి సత్యకుమార్, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉన్నట్లుగా చెబుతున్నారు.
అదే టైం లో చంద్రబాబు కొంతమంది మంత్రుల పనితీరు విషయంలో అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. వారిని తమ శాఖల మీద దృష్టి పెట్టాలని ఆదేశించడం ద్వారా మరింత సమయం ఇస్తారని అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు కేబినెట్ లో అనూహ్యంగా చాలా మంది మంత్రులకు శాఖలు లభించాయి.
అలాగే వారు అనుకోకుండానే వరాలు ఇచ్చి మరీ కీలక శాఖలను అప్పగించారు. అటువంటి వారు తమకు లభించిన ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంది. లేకపోతే చంద్రబాబు మార్క్ చర్యలకు కూడా ఆస్కారం ఉంటుందని అంటున్నారు. మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో 24 మందికే చాన్స్ ఇచ్చారు అంటే 140 మంది ఇంకా ఉన్నారు.
ఒకవేళ ప్రస్తుత మంత్రులలో ఎవరైనా చంద్రబాబు ఆశించినట్లుగా కనుక పనితీరుని మార్చుకోకపోతే కీలక నిర్ణయాలకు కూడా బాబు వెళ్లే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.