Begin typing your search above and press return to search.

ఆ మంత్రి గారు రగిలిపోతున్నారా...!?

ఇటీవల అయితే తనకు పోటీ చేయడం ఇష్టం లేదని కానీ జగన్ వత్తిడితోనే బరిలోకి దిగాల్సి వస్తోందని సంచలన కామెంట్స్ చేశారు.

By:  Tupaki Desk   |   3 Feb 2024 11:30 PM GMT
ఆ మంత్రి గారు రగిలిపోతున్నారా...!?
X

వైసీపీలో ఒక సీనియర్ మంత్రి రగిలిపోతున్నారా అంటే జవాబు అవును అనే వస్తోంది. ఆయన ఎవరో కాదు ఉత్తరాంధ్రాలో సీనియర్ నేతగా ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు. ఆయనది నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం. 1989లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ధర్మాన మంత్రిగా కూడా చిన్న వయసులోనే పనిచేశారు.

గతంలో కోట్ల విజయభాస్కరరెడ్డి, నేదురుమల్లి జనార్ధన రెడ్డిల మంత్రి వర్గాలలో యువ మంత్రిగా చేశారు. ఆ తరువాత వైఎస్సార్ క్యాబినేట్ లో సీనియర్ సహచరుడిగా చేరి కీలక మంత్రిత్వ శాఖలు చూశారు. అలా రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాలలో సైతం పనిచేసిన ధర్మాన పుష్కర కాలం క్రితమే రెవిన్యూ మంత్రి అయ్యారు. ఇక వైసీపీలో చేరి 2014లో ఆయన శ్రీకాకుళం నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.

అదే ధర్మాన 2019లో గెలిచి వచ్చారు. ఆయంకు తొలి దఫాలోనే మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ ఆయన అన్న క్రిష్ణదాస్ కి దక్కింది. ఇక 2022లో జరిగిన విస్తరణలో ప్రసాదరావు మంత్రి అయ్యారు. అయితే జిల్లా రాజకీయాల మీద పూర్తి పట్టు ఆయనకే అని అంతా అనుకున్నా వైసీపీ హై కమాండ్ మాత్రం పక్క జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ పర్యవేక్షణలో పెట్టడంతోనే ఆయన వర్గం రగులుతోంది అని అంటున్నారు.

అలా బొత్స ఆయన మేనల్లుడు విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సిక్కోలు జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారు. వారికి హై కమాండ్ పెత్తనం ఇవ్వడమే కాదు గతంలో బొత్సను రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమించింది. ఆయనను ఎన్నికల వేళ విజయనగరం జిల్లా మీద ఫోకస్ చేయమని చెప్పి ఆయన మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావుకు అవే బాధ్యతలు అప్పగించింది. దాంతోనే ధర్మాన అనుచరులు మండుతున్నారుట.

సీనియర్ మంత్రిగా ఉన్న ధర్మానకు జిల్లా బాధ్యతలు అప్పగిస్తే వైసీపీకి రాజకీయంగా మేలు జరుగుతుందని అంటున్నారు. ఉమ్మడి సిక్కోలు జిల్లాలో మొత్తానికి మొత్తం 10 అసెంబ్లీ సీట్లు ఉంటే ధర్మాన తన చాతుర్యంతో గెలిపించుకుని వస్తారు అని అంటున్నారు. అలాంటిది ఆయనను పక్కన పెట్టడం వల్ల తన శ్రీకాకుళం సీటుకే పరిమితం అవుతారు అని అంటున్నారు.

ఇక జిల్లాలో చాలా అసెంబ్లీ సీట్లలో చూస్తే వర్గ పోరు ఉందని దాన్ని పక్క జిల్లాల వారు ఏమి పరిష్కరిస్తారు అని ప్రశ్నిస్తున్నారు. ధర్మానను పక్కన పెట్టడం వల్లనే ఆయన ఇటీవల కాలంలో హై కమాండ్ కి ట్రబుల్ ఇచ్చేలా హాట్ కామెంట్స్ చేస్తున్నారు అని కూడా అంటున్నారు. ఇటీవల కళింగ కోమట్ల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడప నుంచి రెడ్లు వచ్చి జిల్లాలో భూ కబ్జాలకు తెగబడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

వారి వెనక పెద్దలు ఉన్నారని బాంబు పేల్చారు. అవి ఎవరి మీద అన్న చర్చకు కూడా తెరలేచింది. అయితే ధర్మాన తన మనసులో ఏదీ దాచుకోకుండా ఎప్పటికపుడు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు. నేను ఈసారి పోటీ చేయను అని ఆరు నెలల ముందు ఆయన ప్రకటించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. ఇటీవల అయితే తనకు పోటీ చేయడం ఇష్టం లేదని కానీ జగన్ వత్తిడితోనే బరిలోకి దిగాల్సి వస్తోందని సంచలన కామెంట్స్ చేశారు.

ఇక ధర్మానకు రెండవ విడతలో మంత్రి పదవి ఇచ్చినపుడు కూడా ఆయన నాకు మంత్రి పదవి కొత్త కాదు అని వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయంగా అన్నీ చూసాను అని కూడా చెప్పుకున్నారు. మొత్తానికి శ్రీకాకుళం జిల్లా అంటేనే టీడీపీకి కంచుకోట. అలాంటి చోట 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. ఇపుడు అలాంటి పరిస్థితులు ఉంటాయా అన్న చర్చ అయితే ఉంది. దాంకి తోడు సీనియర్ మంత్రి కొంత దూరంగా ఉంటున్నారు అన్న ప్రచారం అయితే సాగుతోంది. మరి వైసీపీ హై కమాండ్ ఈ విషయంలో ఏమైనా దిద్దుబాటు చర్యలకు దిగుతుందా అన్నది చూడాలని అంటున్నారు.