పాడె మోసినా... చెంప చెళ్లు మనిపించినా... ఎర్రబెల్లి స్టైలే వేరు
తెలంగాణ రాజకీయాల్లో తరచూ వార్తల్లో నిలిచే నేతల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒకరు.
By: Tupaki Desk | 5 Oct 2023 1:30 AM GMTతెలంగాణ రాజకీయాల్లో తరచూ వార్తల్లో నిలిచే నేతల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఒకరు. మనషులో ఎలాంటి కల్మషం లేకుండా... తన చర్యలు ఎలా రిఫ్లెక్ట్ అవుతాయో అనే శషబిషలు లేకుండా వ్యవహరించడం ఎర్రబెల్లి నైజం. అలాంటి సీనియర్ మోస్ట్ నేత రెండు కీలకమైన చర్యలతో వార్తల్లో నిలిచారు. సొంత పార్టీ ఎమ్మెల్యేపై చనువుగా చేయి మీద వేసి... `చేయి చేసుకున్నారు` అనే ప్రచారంతో ఓ వైపు... పార్టీ నేత మృతి చెందితే అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోయడం ఇంకోవైపు మీడియా దృష్టిని ఆకర్షించారు.
పలు అభివృద్ధి పనుల్లో పాల్గొవడంలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుషాద్ నగర్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తలపై ప్రేమ పూర్వకంగా చేయితో తాకారు. అయితే, ఈ చర్య వీడియోలో ఆయన్ను కొట్టినట్లుగా కనిపిస్తుండటంతో మీడియాలో వైరల్ అయింది. ఎమ్మెల్యేను అగౌరవపరిచేలా మంత్రి కొట్టారని, సీనియర్ నేత ఇలా వ్యవహరించడం ఏంటని సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగిపోయింది. అయితే, తన తమ్ముడి అంత చనువు ఉంది కాబట్టే ఆప్యాయతతో మంత్రి చేయి వేశారే తప్ప ఆయన్ను కొట్టాలనే ఉద్దేశం లేదని ఎర్రబెల్లి అనుకూల వర్గాలు స్పందించాయి. గతంలో ఎప్పుడూ కూడా మంత్రి ఎర్రబెల్లి ఇలా స్పందించలేదని వివరణ ఇస్తున్నాయి.
కాగా, మంత్రి ఎర్రబెల్లి తనను నమ్ముకున్న వారి పట్ల ఎలా మసులుకుంటారో తాజాగా ఓ సంఘటన తెలియజేస్తోంది. వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలంలోని బురాన్ పల్లి మాజీ ఉప సర్పంచ్ ముద్దంగుల వెంకటమల్లు మృతి చెందగా విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ గ్రామానికి వెళ్లి, ఆయన పార్థీవ దేహం పై పుష్ప గుచ్చం ఉంచి, నివాళులర్పించారు. ఆయనతో తన కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని, కంట తడి పెట్టారు. అయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతి ని తెలియజేశారు. అనంతరం అంత్యక్రియలో పాల్గొని పాడే మోశారు.