Begin typing your search above and press return to search.

తెలంగాణ మంత్రికి ఈడీ షాక్‌!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొద్ది నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌

By:  Tupaki Desk   |   5 Sep 2023 11:08 AM GMT
తెలంగాణ మంత్రికి ఈడీ షాక్‌!
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొద్ది నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ).. తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కు షాక్‌ ఇచ్చింది. ఆయన మంత్రివర్గంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్‌ కుటుంబ సభ్యులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పుడీ ఈ వ్యవహారం తెలంగాణలో హాట్‌ టాపిక్‌ గా మారింది. కాగా ఇటీవల కేసీఆర్‌ ప్రకటించిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాలో కరీంనగర్‌ నుంచి గంగుల కమలాకర్‌ మరోసారి చోటు దక్కించుకున్నారు.

గంగుల కుటుంబానికి చెందిన శ్వేతా గ్రానైట్‌ కంపెనీ, శ్వేతా ఏజెన్సీ.. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలో గంగుల కుటుంబ సభ్యులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. వాస్తవానికి గతేడాది నవంబర్‌ లోనే శ్వేత గ్రానైట్‌ ఏజెన్సీలో ఈడీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైనాకు చేసిన గ్రానైట్‌ ఎగుమతుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ నిర్ధారించింది.

7.6 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్రానైట్‌ ను గంగుల కమలాకర్‌ కుటుంబం అక్రమంగా తరలించినట్లు ఈడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అప్పట్లో కాకినాడలో అధికారులు పర్యటించారు. కృష్ణపట్నం, చెన్నై, విశాఖపట్నం ఓడరేవుల పరిశీలనలో గనుల శాఖకు ఇచ్చిన సమాచారంలో గ్రానైట్‌ల పరిమాణం, ఎగుమతులు వాస్తవ పరిమాణానికి భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. గ్రానైట్‌ పరిమాణం 7.6 లక్షల క్యూబిక్‌ మీటర్లు. ఇది అనుమతించదగిన పరిమాణాన్ని మించిపోయింది. తద్వారా రూ. 4.8 కోట్ల ఉల్లంఘనలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆ డబ్బును విమానంలో బదిలీ చేసినట్లు ఈడీ అభియోగాలు మోపింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను రూ. 50 కోట్లు పెండింగ్‌ లో ఉండగా రూ. 3 కోట్లు మాత్రమే చెల్లించినట్లు ఈడీ ఆరోపిస్తోంది.

కాగా గతంలోనే శ్వేతా గ్రానైట్‌ కంపెనీ ప్రతినిధులకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అప్పట్లో ఆ కంపెనీ ప్రతినిధులు ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. తాజాగా మరోసారి శ్వేతా గ్రానైట్‌ కంపెనీ ప్రతినిధులయిన గంగుల కమలాకర్‌ కుటుంబ సభ్యులకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న గ్రానైట్‌ కంపెనీలకు గతేడాది నవంబర్‌ లోనే ఈడీ నోటీసులు జారీ చేసింది. రెండేళ్ల క్రితం గంగుల కమలాకర్‌ గ్రానైట్‌ వ్యాపారంపై కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ఈడీకి ఫిర్యాదు ఇచ్చారు.

కరీంనగర్‌ లో గంగుల మైనింగ్‌ మాఫియాను నడుపుతున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అయితే బండి ఫిర్యాదుపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఈ క్రమంలో మైనింగ్‌ మాఫియాపై బీజేపీ నేత మహీందర్‌ రెడ్డి, తెలంగాణ హైకోర్టు న్యాయవాది గంగాధర్‌ మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఈడీ గంగుల కుటుంబానికి నోటీసులు జారీ చేసింది. గతంలోనే కరీంనగర్‌ లో గ్రానైట్‌ వ్యాపారుల అక్రమాలకు సంబంధించి ఎనిమిది కంపెనీలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరంతా మంత్రి గంగుల కమలాకర్‌ కుటుంబ సభ్యులని.. ఆయనకు అత్యంత సన్నిహితులని వార్తలు వచ్చాయి.

ఈడీ నోటీసుల తర్వాత చాలా కాలంగా సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్‌లో మొత్తం 30 బృందాలు సోదాలు చేశాయి. గ్రానైట్‌ వ్యవహారంపై ఆరా తీయడంతోపాటు పలు పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

కరీంనగర్‌ మైనింగ్‌ కేసులో 170 కోట్ల అవినీతి జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది. రైల్వేలు, నౌకల్లో మైనింగ్‌ ను విదేశాలకు తరలించి కోట్లాది రూపాయలు ఆర్జించినట్లు ఈడీకి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే గతేడాది సీబీఐ అధికారులు మంత్రి గంగుల కమలాకర్‌ ఇంటికి వెళ్లారు. గంగుల అక్కడ లేకపోవడంతో అధికారులు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు.