మంత్రి గుడివాడకు పార్టీ బాధ్యతలు...పోటీకి నో చాన్స్...!?
ఆయనను విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ వైసీపీ డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమించింది.
By: Tupaki Desk | 10 Feb 2024 5:35 PM GMTవైసీపీ అధినాయకత్వం విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గుడివాడ అమర్నాథ్ కి పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఆయనను విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీ వైసీపీ డిప్యూటీ రీజనల్ కో ఆర్డినేటర్ గా నియమించింది. అంటే ఆయన విశాఖ, అనకాపల్లి అరకు మూడు పార్లమెంట్ నియోజకవర్గాలలో పార్టీ విజయానికి కృషి చేయాల్సి ఉంటుంది.
యధా ప్రకారం ఈ నియోజకవర్గాలకు వైవీ సుబ్బారెడ్డి రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉంటారు. ఆయనతో కలసి గుడివాడ పనిచేస్తారు అన్న మాట. ఇక పోతే వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ సీటు ఇస్తున్నారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరం. పైగా ఆయనకు పెద్దల సభలో అకామిడేషన్ ఉంది.
కానీ యువ మంత్రిగా ఉంటూ మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్న గుడివాడకు పార్టీ బాధ్యతలు అప్పగించడంతో ఆంతర్యం ఏమిటి అన్నదే ఆయన అనుచరులకు అర్ధం కావడం లేదు. కేవలం గుడివాడకే ఈ బాధ్యతలు అప్పగించలేదు. ఆయనతో వైసీపీలో మరింతమందికి కూడా పార్టీ బాధ్యలను ఆ పార్టీ అధినాయకత్వం అప్పగించింది.
అలా చూసుకుంటే కనుక ఒంగోలు పార్లమెంట్ ఉమ్మడి నెల్లూరు జిల్లాల కోఆర్డినేటర్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని నియమించారు. అలాగే విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడిగా మల్లాది విష్ణుకి చాన్స్ ఇచ్చారు. ఇక గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్‌గా విజయసాయిరెడ్డిని ఎంపిక చేశారు. అదే విధంగా కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల రీజనల్ కోఆర్డినేటర్‌గా పి.రామసుబ్బారెడ్డిని, కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల కోఆర్డినేటర్‌గా కె.సురేష్‌బాబుని నియమించారు.
ఇందులో చాలా మందికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. వారంతా పార్టీ పనికోసమే నియమితులు అయ్యారు. అలా చూసుకుంటే గుడివాడ సేవలను పార్టీ కోసం వాడుకుంటున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. ఇటీవల గుడివాడ మీడియాతో మాట్లాడుతూ తన సేవలను పార్టీ ఏ విధంగా వాడుకుంటే ఆ విధంగా తాను పనిచేస్తాను అని చెప్పారు. అంటే గుడివాడకు ఈ సంగతి ముందే చెప్పారా అన్న చర్చ వస్తోంది. ఒకవేళ అదే నిజం అయితే ఈసారి ఎన్నికల్లో టికెట్ దక్కని తొలి మంత్రిగా గుడివాడ ఉంటారా అన్నదే ఆయన అనుచరులకు కలవరంగా ఉందిట. చూడాలి మరి ఏమి జరుగుతుందో.