ఇంత రౌడీయిజం అవసరమా హరీశ్? మండిపడుతున్న కమలనాథులు
సిద్దిపేట రైల్వే స్టేషన్ నుంచి తొలిసారి ప్యాసింజర్ రైలును ప్రారంభించే కార్యక్రమంలో మంత్రి హరీశ్ వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
By: Tupaki Desk | 4 Oct 2023 4:34 AM GMTనీతులు చెప్పేటోళ్లు.. తాము అనుసరించే విధానాల్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే.. తమకో న్యాయం.. పక్కోళ్లకు ఒక న్యాయం అన్నట్లుగా వ్యవహరించే తీరు అస్సలు సరికాదు. తాజాగా మంత్రి హరీశ్ తీరు చూస్తే.. ఇలాంటి తీరే కనిపిస్తుంది. ప్రోటోకాల్ ప్రకారం చేయాల్సిన తీరులో చేయకుంటే.. దానికి స్పందించాల్సిన విధానం ఒకటి ఉంటుంది. అందుకు భిన్నంగా తాను మంత్రి అన్న విషయాన్ని మర్చిపోయి.. అవసరానికి మించిన ఆగ్రహాన్ని ప్రదర్శించిన వైనం చూస్తే.. ఇదేం తీరు హరీశ్? అన్న ప్రశ్న తలెత్తకమానదు.
సిద్దిపేట రైల్వే స్టేషన్ నుంచి తొలిసారి ప్యాసింజర్ రైలును ప్రారంభించే కార్యక్రమంలో మంత్రి హరీశ్ వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రోగ్రాం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో లేని వైనంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయటం ఒక ఎత్తు అయితే.. ప్రధానమంత్రి ఫోటోను చించేసిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్.. బీజేపీ శ్రేణులు పరస్పరం తలపడటం.. కుర్చీలు విసురుకోవటం ఒక ఎత్తు అయితే.. తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ మంత్రి హరీశ్ రావు అక్కడ ఏర్పాటు చేసిన ఎల్ ఈడీ టీవీని పక్కకు పడేసిన తీరును తప్పు పడుతున్నారు.
బాధ్యత కలిగిన మంత్రిగా ఉంటూ.. అధికారులు చేసిన తప్పులు సరిదిద్దాలి. లేదంటే.. వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి. అందుకు భిన్నంగా ఈ రౌడీయిజం ఏమిటి? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మంగళవారం సాయంత్రం నిజామాబాద్ నుంచి వర్చువల్ పద్దతిలో ప్రధాని నరేంద్ర మోడీ రైలును ప్రారంభించే కార్యక్రమం రసాభాసాగా ముగిసింది. ఈ కార్యక్రమానికి బీజేపీ.. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు సిద్దిపేట రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు.
రైలును తెచ్చింది మేమే అంటూ ఎవరికి వారు పోటాపోటీగా నినాదాలు చేయటం షురూ చేవారు. ఇదే సమయంలో మంత్రి హరీశ్ తన అనుచరులతో అక్కడకు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు ప్లకార్డులు పట్టుకొని హరీశ్ కు మద్దతుగా నినాదాలు పలికారు. పోలీసులు వారించినా వారు వెనక్కి తగ్గలేదు. పరిస్థితిని అర్థం చేసుకున్న దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నేరుగా వెళ్లి రైలులో కూర్చున్నారు. రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో లేకపోవటంపై ఆయన రైల్వే అధికారులపై మండిపడ్డారు.
హరీశ్ అగ్రహంతో.. అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు పలువురు అక్కడ ఏర్పాటు చేసిన ప్రధాని మోడీ ఫ్లెక్సీని చించేశారు. వర్చువల్ పద్దతిలో ప్రధాని మోడీ రైలు ప్రారంభించటానికి వీలుగా ఏర్పాటు చేసిన ఎల్ ఈడీ టీవీని కార్యకర్తలు మోసుకు రాగా.. మంత్రి హరీశ్ రావు పక్కకు పడేసిన వైనం కనిపించింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సైతం రైల్వే అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఇరు పార్టీలకు చెందిన వారు పోటాపోటీగా కుర్చీలు విసురుకోవటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న తోపులాటలో పలువురు గాయపడ్డారు. కేసీఆర్ లేకుంటే రైలు ఎలా వచ్చేదన్న హరీశ్.. రాష్ట్ర వాటాగా 33 శాతం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ ఫోటోను పెట్టాలి కదా? అని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. ప్రధాని మోడీని అవమానించిన మంత్రి హరీశ్ రావు.. ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డిలపై కేసు నమోదు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సిద్దిపేట పోలీసుల్ని డిమాండ్ చేశారు.
మంత్రి హరీశ్ తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు టీవీలను తన్నటం.. ఫోటోలను చించివేయటం సిగ్గుచేటన్న రఘునందన్..మంత్రిమీద పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ 3 కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా మంత్రి హరీశ్ ప్రవర్తన ఉందని.. సీఎం కేసీఆర్ తన మేనల్లుడికి నేర్పిన బుద్ధి ఇదేనా? అంటూ తప్పు పట్టారు. ఏమైనా.. ముఖ్యమంత్రి ఫోటో లేకపోవటంపై నిరనస చేయటం సరైన పద్దతే. కానీ.. హింసాత్మక ధోరణిని ప్రదర్శించటం.. అది కూడా మంత్రి హోదాలో ఉండి చేయటాన్ని పలువురు తప్పుపడుతున్నారు.